
భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని..
మహబూబాబాద్ రూరల్ : తనకు తెలియకుండానే తన 3.10 ఎకరాల వ్యవసాయ భూమిని బావ, అక్క, మరో ఇద్దరు అక్కలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆగ్రహంతో సొంత బావను బావమరిది, అతడి భార్య కలిసి హత్య చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లిలో ఈ నెల 23వ తేదీన జరిగిన ఉప్పలయ్య హత్య కేసులో నిందితులను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ఎన్.తిరుపతిరావు వెల్లడించారు. ఈ మేరకు హత్య వివరాలను రూరల్ పీఎస్‌లో వెల్లడించారు. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కొనకొండ చెన్నయ్య, రాజమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు మల్లేశ్ ఉండగా ఒక కుమార్తె మృతిచెందింది. చెన్నయ్యకు సంబంధించిన వ్యవసాయ భూమి నుంచి 3.10 ఎకరాలను మల్లేశ్ పెద్ద అక్క కోమల, మరో ఇద్దరు అక్కలు అతడికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సదరు భూమి తగదా విషయంలో పలుమార్లు పంచాయితీలు జరగగా మల్లేశ్ పెద్ద బావ ఉప్పలయ్య పెద్దరికం వ్యవహరించి అందుకు సరేనని ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో తన భూమిని తనకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయమంటే ఉప్పలయ్య మాటవినకపోగా డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. మల్లేశ్ డబ్బు ఇచ్చినా భూమి మాత్రం రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో మల్లేశ్ తన బావపై కక్ష పెంచుకుని అవకాశం కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో ఈ నెల 23వ తేదీన ఉప్పలయ్య గ్రా మ శివారులోల గొర్రెలు మేపేందుకు వెళ్లగా పథకం ప్రకారం మల్లేశ్, తన భార్య ఉమ కలిసి ఉప్పలయ్య ను ఇనుప రాడ్‌తో కొట్టగా అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. భూవివాదమే చిలికిచిలికి గాలివానలా మారి చివరకు ఉప్పలయ్య హత్యకు దారితీసిందని డీఎస్పీ పేర్కొన్నారు. సమావేశంలో రూరల్ సీఐ సర్వయ్య, కేసముద్రం ఎస్సైలు కరుణాకర్, నరేశ్, రవికిరణ్, రూరల్ ఎస్సై దీపిక పాల్గొన్నారు.
బావను హత్య చేసిన బావమరిది,
అతడి భార్య
ఈ ఘటనలో ఇద్దరి అరెస్ట్, రిమాండ్
వివరాలు వెల్లడించిన
డీఎస్పీ ఎన్.తిరుపతిరావు