
తల్లిదండ్రులు పిల్లలను పర్యవేక్షించాలి
‘సాక్షి’తో వరంగల్ నార్కొటిక్ విభాగ డీసీపీ సైదులు
సాక్షి, వరంగల్: మాదకద్రవ్యాల వ్యసనం ఎన్నో కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది. దీనికి అలవాటుపడిన వారిలో ఎక్కువగా యువత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థులే తప్పుదారి పడుతున్నారు. చెడు స్నేహాలు, ఒకరిని చూసి మరొకరు ఇలా మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. ఈనేపథ్యంలో తమ పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వరంగల్ నార్కొటిక్ విభాగం డీసీపీ సైదులు ‘సాక్షి’కి శనివారం తెలిపారు. కుటుంబం తీసుకునే ప్రత్యేక జాగ్రత్తలతో డ్రగ్స్, గుట్కా, గంజాయి, సిగరెట్ మొదలగు చెడు అలవాట్ల వైపు రాకుండా చూడాలని పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆ పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు రోల్‌మోడల్‌గా ఉండాలని సూచించారు. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, పిల్లలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వ్యసనాలకు అలవాటుపడకుండా చూసుకోవాలని, ఒకవేళ పిల్లలు మాదకద్రవ్యాలకు బానిసలైనట్టు తెలిస్తే వెంటనే నిపుణుల సాయం తీసుకోవాలని పేర్కొన్నారు.