
సూర్యాతండాలో విషాదఛాయలు●
● నర్సాపూర్‌లో
తండా విద్యార్థి ఆత్మహత్య
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పుల్లూరు జీపీ పరిధి సూర్యా తండాలో విషాదం అలుముకుంది. తండాకు చెందిన అజ్మీరా మేగ్యా, మంజుల దంపతుల పెద్ద కుమారుడు తరుణ్(19) మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కళాశాల సమీపంలోని ప్రైవేట్ హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగం చేసి తమను సాకుతావానుకుంటే ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోయావా బిడ్డా అంటూ తల్లిదండ్రులు మేగ్యా, మంజుల.. కుమారుడి మృతదేహంపై పడి రోదించిన తీరు చూసి పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. తరుణ్ మృతదేహానికి గురువారం సూర్యాతండాలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, తరుణ్ మృతికి గల కారణాలు నర్సాపూర్ పోలీసుల విచారణలో తేలనున్నాయి.