
మరమ్మతులు కరువు
నెల్లికుదురు: రైతుల పంటలకు సాగు నీరు అందించేందుకు నిర్మించిన చెక్‌డ్యాంకు రెండు వైపులా గండిపడింది. దీంతో నీరు నిల్వ ఉండడం లేదు. కాగా, ఆకేరు వాగు పరీవాహక రైతుల పంటలకు సాగు నీరు అందడం లేదు. మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
2021–22లో నిర్మాణం..
నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామ పరిధిలో ఆకేరు వాగు పరీవాహక రైతుల సౌకర్యార్థం 2021–22లో అప్పటి ప్రభుత్వం కోట్లు వెచ్చించి చెక్ డ్యాం నిర్మాణం చేపట్టింది. అయితే గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు చెక్ డ్యాం రెండు పైపులా గండ్లు పడి నిరుపయోగంగా మారింది. నర్సింహులపేట మండలం జయ్యారం గ్రామం వైపు ఒక గండి, నెల్లికుదురు మడంలంలోని మునిగలవీడు గ్రామం వైపు మరో భారీ గండిపడి చెక్‌డ్యాంలో చుక్క నీరు లేకుండా పోతోంంది. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు.
భూగర్భ జలాల పెంపు..
ఆకేరు వాగులోని చెక్‌డ్యాం ద్వారా నెల్లికుదురు మండంలోని మధనతుర్తి, మునిగలవీడు, నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ, జయ్యారం శివారు గ్రామాలు, తండాల పరిధిలో గ్రౌండ్ వాటర్ పెరిగి వేల ఎకరాల్లో పంటలు పండుతాయి. చెక్‌డ్యాంకు గండి పడడంతో ఆయా గ్రామాల రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఆయా గ్రామాల పరిధిలో ఆకేరు వాగులో గుంతలు తవ్వి విద్యుత్ మోటార్ల ద్వారా పంటలకు సాగునీరు అందిస్తున్నారు. కాగా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చెక్ డ్యాంకు మరమ్మతులు చేపట్టాలని పరీవాహక రైతులు కోరుతున్నారు.
ప్లాన్ లేకుండా చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారు..
మండలంలోని మునిగలవీడు గ్రామ పరిధిలో ఆకేరు వాగులో ఎలాంటి ప్లాన్ లేకుండా చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టి ప్రజాధనం వృథా చేశారు. దీంతో రెండేళ్లకు గండ్లుపడ్డాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చెక్‌డ్యాంలో నీరు ఉండేలా మరమ్మతులు చేపట్టి రైతుల పంటలకు సాగు నీరు అందించాలి.
– ఇస్సంపల్లి సైదులు, మునిగలవీడు
మునిగలవీడులో ఆకేరువాగుపై చెక్‌డ్యాంకు గండి
ఆందోళన చెందుతున్న పరీవాహక రైతులు
మరమ్మతులు చేపట్టాలని వేడుకోలు

మరమ్మతులు కరువు

మరమ్మతులు కరువు