
ఏసీబీ అధికారుల తనిఖీలు
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వం నుంచి విడుదలైన సరుకులు విద్యార్థులకు అందడం లేదనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఏసీబీ, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, తూనికలు కొలతలు, ఆడిట్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5గంటల వరకు ముమ్మరంగా సోదాలు చేశారు. ఈ సందరర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ.. గిరిజన సహకార సంస్థ నుంచి వచ్చిన సరుకులు విద్యార్థులకు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారన్నారు. హాస్టల్, పాఠశాలలో మౌలిక వసతులు, మరుగుదొడ్లుకు డోర్లు, నల్లాలు పనిచేయకపోవడం, తాగునీటి సదుపాయం లేదని, సీసీ కెమెరాలు పని చేయడం లేదని తెలిపారు. హాస్టల్ నిర్వాహకులు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు. హాస్టల్ నుంచి విద్యార్థులను బయటకు తీసుకెళ్లే క్రమంలో అవుట్ రిజిస్టర్ బుక్ పర్యవేక్షణ సక్రమంగా లేదన్నారు. హాస్టల్‌లో జరుగుతున్న సంఘటనలపై రాష్ట్ర, జిల్లా గిరిజన శాఖ అధికారులకు వివరాలను వెల్లడిస్తామన్నారు. ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలనుకునే వారు 91543 88912 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని, ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామన్నారు. కార్యక్రమంలో ఎసీబీ ఇన్‌స్పెక్టర్లు ఎల్.రాజు, ఎస్.రాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గిరిజన హాస్టల్‌లో ఉదయం 7నుంచి
సాయంత్రం 5గంటల వరకు సోదాలు