
మీన మేషాలు..
నెహ్రూసెంటర్: మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధి ంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొన్నేళ్లుగా ఏటా ఉచి తంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. అధికారులు చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదులుతున్నారు. ఏటా ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పంపిణీకి సమాయత్తం అయ్యేది. కాగా, గతేడాది ఆలస్యంగా పంపిణీ చేయగా, ప్రస్తుతం ఇప్పటి వరకు ఇంకా టెండర్లు కూడా పిలవకపోవడంతో ఉచిత చేప పిల్లల పంపిణి ఉంటుందా, అదును దాటిన తర్వాత అందిస్తే ప్రయోజనం లేకుండా పోతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నగదు బదిలీ చేయాలి..
గతేడాది నుంచి సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారు. దీంతో చేపలు సరిగా పెరగడం లేదని, ఆగస్టులోపు పిల్లను చెరువుల్లో వదలాలని మత్స్యకారులు కోరుతున్నారు. కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుండా నాసిరకం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో మత్స్యసహకార సంఘాలకు ఉచిత చేప పిల్లలకు బదులుగా నగదు బదిలీ పథకాన్ని చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు.
సగం చేప పిల్లలతోనే సరి..
జిల్లాలో 1250 చెరువులు ఉన్నాయి. 200 మత్స్య సహకార సంఘాలు ద్వారా 14 వేల మంది మత్స్యకారులు చెరువులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గతేడాది జిల్లాలో ఆలస్యంగా ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడంతో అప్పటికే మత్స్యకారులు కొనుగోలు చేసిన చేప పిల్లలను చెరువుల్లో పోసుకున్నారు. దీంతో జిల్లాకు 4 కోట్ల చేప పిల్ల లను పంపిణీ చేయాల్సి ఉండగా.. కేవలం 2 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈ ఏడాదైనా పూర్తిస్థాయిలో ఆగస్టులోపే చెరువులకు సరిపడా చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు..
గతేడాది చెరువుల్లో పోసిన చేప పిల్లలు అకాల వర్షాలకు కొట్టుకుపోయాయి. జిల్లాలో 46 చెరువులు తెగిపోగా సుమారు రూ.3 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలుపుతున్నారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, చెరువులు, కుంటల మరమ్మతులు వెంటనే చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఊసేలేని టెండర్ల ప్రక్రియ...
ఈ ఏడాది ముందుగానే వర్షాలు ప్రారంభమయ్యాయి. చెరువులు, కుంటల్లో నీరు చేరింది. ఉచిత చేప పిల్లల పంపిణీ ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏటా మే నెలలోనే చేప పిల్లల పంపిణీకి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఆగస్టు చివరి నాటికి పంపిణీ పూర్తి జరిగేది. ప్రస్తుతం టెండర్ల పిలవకపోవడం, చివరి సమయంలో హడావుడిగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులపై ఆధారపడి జీవిస్తున్న తమ జీవనోపాధిని దెబ్బతీయొద్దని మత్స్యకారులు కోరుతున్నారు.
నిబంధనలకు నీళ్లు..
ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. చెరువుల్లో చేప పిల్లలను వదిలే క్రమంలో వీడియో రికార్డింగ్ చేయడం, పిల్లలను మత్స్యకారుల సమక్షంలో తూకం వేయడం, లెక్కపెట్టడం వంటివి చేయాల్సి ఉంటుంది. మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యం కారణంగా అవేవి చేయకుండానే తూతూమంత్రంగా చేప పిల్లలను వదిలినట్లు ఆరోపణలు వచ్చాయి. చేప పిల్లల పంపిణీపై విజిలెన్స్ విచారణ కూడా జరిగినట్లు సమాచారం. అధికారులు, కాంట్రాక్టర్‌లు చేప పిల్లలను పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.
ఉచిత చేప పిల్లల పంపిణీపై నీలినీడలు
ఇప్పటివరకు ఖరారు కాని టెండర్లు
అదును దాటితే
నష్టమేనంటున్న మత్స్యకారులు
పూర్తిగా మరమ్మతులకు
నోచుకోని చెరువులు, కుంటలు