
ఇరువర్గాల దాడి.. తీవ్ర ఉద్రిక్తత
● సోషల్ మీడియాలో పోస్టే
ఘర్షణకు కారణం..?
రామన్నపేట : వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తవాడకు చెందిన తుమ్మలకుంట ప్రాంతంలో శుక్రవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొదట ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన దాడి రెండు కుటుంబాలతో పాటు రెండు ప్రాంతాలకు విస్తరించి సాముహిక దాడికి దారితీసింది. ఇరువర్గాల ఫిర్యాదుతో మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇన్‌స్పెక్టర్ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తవాడ తుమ్మలకుంటకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సాజిద్, అదే ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థి అర్ఫాత్ మధ్య శుక్రవారం సాయంత్రం మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. గాయపడిన అర్ఫాత్ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆగ్రహించిన కుటుంబీకులు రాత్రి 8 గంటలకు సాజిద్ ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు. వెంటనే విషయం తెలుసుకున్న సాజిద్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు 9గంటల సమయంలో అర్ఫాత్ ఇంటికి వెళ్లి వారి ఇంటిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు గ్రూపులు విడిపోయి ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున దాడి చేసుకునేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో స్థానికులతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిని శాంతింప చేశారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సాజిత్, అర్ఫాత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు.
ఆ.. పోస్టే ఘర్షణకు కారణం?
శుక్రవారం రాత్రి నగరంలోని తుమ్మలకుంటలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు వర్గాలు దాడి చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టే కారణమని చర్చించుకుంటున్నారు. మైనర్లు ప్రేమించుకుంటున్నామని నెపంతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో ఇరు కుటుంబ సభ్యులు ఘర్షణకు పాల్పడ్డట్లు స్థానికులు పేర్కొంటున్నారు.
ఉత్సాహంగా చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని టీటీడీ కల్యాణ మంటపంలో ఉమ్మడి వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 112మంది క్రీడాకారులు వచ్చినట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి.కన్నా పేర్కొన్నారు. ఆర్బిటర్లు సీహెచ్ శ్రీని వాస్, డి.ప్రేమ్‌సాగర్, ఫ్రాంక్లిన్, కట్కూరి అక్షయ్, ప్రశాంత్ పాల్గొన్నారు.