
భట్టిగారూ.. బాధలు తీర్చండి
సాక్షి, మహబూబాబాద్: సారవంతమైన భూములు, ఇనుప ఖనిజాలకు నెలవు.. కష్టించి పనిచేసే కార్మికులు, కర్షకులు ఉన్నప్పటికీ మానుకోట జిల్లా ఆశించినస్థాయిలో అభివృద్ధి చెందడం లేదు. జిల్లాలో పేరుకు పెద్ద చెరువు అయిన బయ్యారం చెరువు వర్షాలు కురిస్తేనే నిండే పరిస్థితి ఉంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరు చేసిన కళాశాలల భవనాలకు నిధులు లేవు.. చదువుకున్న వారు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పట్టణా లకు వలస వెళ్తున్నారు. కాగా ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు తొలిసారిగా మంగళవారం వస్తున్న నేపథ్యంలో భట్టిగారూ.. నిధులు ఇచ్చి బాధలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
బయ్యారానికి సాగునీరు ఇవ్వండి..
ఈ ప్రాంతంలో ఉన్న సారవంతమైన భూములను గుర్తించిన కాకతీయలు బయ్యారం చెరువు నిర్మించారు. పేరుకు పెద్ద చెరువుగా ఉన్నా.. చెరువులోకి నీళ్లు రావాలంటే.. వర్షాలు కురవాలి. వాగులు పొంగాలి.. అంతే కానీ ఏ ప్రాజెక్టు నీళ్లు చెరువుకు వచ్చే పరిస్థితి లేదు. చెరువులోకి నీళ్లు తీసుకువచ్చేందుకు ముందుగా సీతారామ ప్రాజెక్టు డిజైన్ చేసినట్లు ప్రచారం జరిగినా.. ప్రాజెక్టు డిజైన్‌లో బయ్యారం కనిపించలేదు. ప్రస్తుతం దేవాదుల నుంచి వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల చెరువుకు గోదావరి నీళ్లు వస్తున్నాయి. అక్కడి నుంచి నీటిని తరలించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 8 కిలోమీటర్లు పైపులైన్ నిర్మించాలి. ఇంతదూరం వచ్చిన గోదావరి జలాలను గంగారం మండలం పుట్టల భూపతి గ్రామం వద్ద ప్రారంభమయ్యే పందిపంపుల వాగులో పైపులైన్ ద్వారా చేర్చాలి. అక్కడి నుంచి కొత్తగూడ, గంగారం మండలాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బయ్యారం పెద్దచెరువుకు పందిపంపులవాగుల ద్వారా నీటిని తీసుకురావొచ్చని ప్రతిపాదనలు తయారు చేశారు. బయ్యారం పెద్ద చెరువు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్‌ద్వారా తులారాం ప్రాజెక్టుకు, కంబాలపల్లి పెద్ద చెరువుకు నీటిని తరలించేవిధంగా ప్రతిపాదనలు తయారు చేశారు. దీంతో బయ్యారం, గార్ల, కామేపల్లి, ఇల్లెందు మండలాలకు సాగునీరు, ఇల్లెందు, మహబూబాబాద్ పట్టణాలకు తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. బయ్యారం చెరువు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గోదావరి జలాలతో బయ్యారం చెరువు నింపేందుకు కావాల్సిన నిధులు కేటాయించాలని ఈ ప్రాంత ప్రజలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కోరుతున్నారు.
భవనాలకు నిధులివ్వండి..
మారుమూల ప్రాంతం మానుకోటలో గిరిజనులు, ఆదివాసీ జనాభా ఎక్కువ. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మానుకోటను జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, అనుబంధ ఆస్పత్రి, నర్సింగ్ కళాశాల మంజూరు చేశారు. వీటితోపాటు జిల్లాకు మంజూరైన ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు ఆర్తి గార్డెన్ దగ్గర 700 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించినట్లు ప్రకటించారు. అయితే ఈ కళాశాలతో మంజూరైన ఖమ్మం కళాశాల భవనాల నిర్మాణం కోసం రూ. 108కోట్లు విడుదల చేశారు. కానీ మహబూబాబాద్ ఇంజనీరింగ్ కళాశాలకు నిధులు మంజూరు చేయలేదు. కాగా ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నిధుల మంజూరు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. అదే విధంగా ప్రభుత్వ పీజీ కళాశాల, హార్టికల్చర్ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉన్నా... భవన నిర్మాణాలకు నిధులు మంజూరు కాక ఇరుకు గదుల్లో తరగతులు కొనసాగుతున్నాయి. వీటికి నిధులు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు.
బయ్యారం చెరువుకు నీళ్లు ఇవ్వండి
భవనాలకు నిధులు కావాలి
వనరులు ఉన్నా ఉపాధి కరువు
పట్టణాలకు వలస వెళ్తున్న యువత
నేడు డిప్యూటీ సీఎం
పర్యటనపై జిల్లా ప్రజల ఆశలు
యువత వలస బాట
వనరులు ఉన్నా.. అనుబంధ పరిశ్రమలు లేకపోవడంతో మానుకోట యువత వలస బాట పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 50వేల మేరకు ఇంటర్, ఆపై చదువులు చదవిన వారు ఉన్నారు. యువతకు ఉపాధి కల్పించిన పెంకు ఫ్యాక్టరీ మూలన పడింది. పెంకు ఫ్యాక్టరీ ప్రాంతంలో గృహ అలంకరణ వస్తువుల తయారీ ఫ్యాక్టరీ నిర్మించాలి. పసుపు, మిర్చి, మొక్కజొన్న ఎక్కువగా పండించే ఈ ప్రాంతంలో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి, రైతులకు ప్రోత్సాహం కల్పించినట్లు అవుతుంది.
సభా ఏర్పాట్ల పరిశీలన..
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధి జ్యోతిరావు పూలే సెంటర్‌లో మంగళవారం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో నిర్వహించనున్న బహిరంగ సభాప్రాంగణ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసముద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు, పలువురు మంత్రులు వస్తున్నారని, ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాత్రి కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ సభా ప్రాంగణాన్ని సందర్శించారు. బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్లం నాగేశ్వర్‌రావు, వేముల శ్రీని వాస్‌రెడ్డి, చిదురాల వసంతరావు, రావుల ముర ళి, బండారు వెంకన్న, కదిర సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

భట్టిగారూ.. బాధలు తీర్చండి