
నేడు మానుకోటకు ఉప ముఖ్యమంత్రి, ఐదుగురు మంత్రుల రాక
● మహబూబాబాద్, కేసముద్రంలో రూ. 500 కోట్ల పనులకు శంకుస్థాపన
సాక్షి, మహబూబాబాద్: పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల నిమిత్తం మంగళవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతోపాటు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. మహబూబాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. హెలికాప్టర్‌లో ఉదయం 12 గంటలకు మహబూబాబాద్ రూరల్ మండలం సోమ్లా తండాకు చేరుకుంటారు. అక్కడ రూ. 100కోట్లతో చేపట్టనున్న రోడ్లు, సబ్ స్టేషన్లు, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ పనులకు శంకుస్థాపన చేస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 1.20కోట్ల విలువైన చెక్కులు అందజేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి కేసముద్రం మున్సిపాలిటీకి చేరుకుని అక్కడ రూ. 300 కోట్లతో చేపట్టనున్న డిగ్రీ కళాశాల భవనం, హౌసింగ్ గోదాంలు, కల్వలలో 1322/11 కేవీ సబ్‌స్టేషన్, మట్టెవాడ, ఉప్పరపల్లి, కేసముద్రంలో నిర్మించనున్న 32/11 కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ పర్యటనలో డిప్యూటీ స్పీకర్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తదితరులు పాల్గొంటారని మహబూబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ సోమవారం తెలిపారు.
గుండెపోటుతో ఈజీఎస్ ఏపీఓ శ్రీనివాస్ మృతి
పాలకుర్తి టౌన్ : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఈజీఎస్ ఏపీఓ కమ్మగాని శ్రీనివాస్‌గౌడ్(50)గుండెపోటుతో మృతి చెందారు. సోమవారం ఉదయం మండల కేంద్రంలోని జనగామ రోడ్డులో వాకింగ్‌కు వెళ్లిన శ్రీనివాస్.. గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలారు. స్థానికులు గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, శ్రీనివాస్ దేవరుప్పుల మండలంలో ఈజీఎస్ ఏపీఓగా విధులు నిర్వర్తిస్తున్నారు. డీఆర్‌డీఓ పీడీ వసంత, అడిషనల్ డీఆర్‌డీఓ పీడీ చంద్రశేఖర్.. శ్రీనివాస్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
రేవంత్ అసమర్థ పాలనే కారణం..
సీఎం రేవంత్‌రెడ్డి అసమర్థ పాలన శ్రీనివాస్‌ను హత్య చేసిందని ఏపీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రావు అన్నారు. దేవరుప్పుల మండలంలో ఏపీఓగా విధులు నిర్వర్తిస్తున్న కమ్మగాని శ్రీనివాస్‌గౌడ్ మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. దీంతో మనస్తాపంతో గుండెపోటుకు గురై మృతి చెందారన్నారు. కాగా, ఈజీఎస్ ఏపీఓల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని డీఆర్‌డీఓ పీడీ వసంత హామీ ఇచ్చారు. ఈజీఎస్ కంప్యూటర్ ఆపరేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే..
దేవరుప్పుల : మూడు నెలలు గడిచినా వేతనాలు ఇవ్వకపోవడంతో ఉపాధి హామీ ఏపీఓ కమ్మగాని శ్రీనివాస్ మనోవేదనతో గుండెపోటుకు గురై మృతి చెందారని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ మేరకు సోమవారం శ్రీనివాస్ కుటుంబీకులను ఫోన్‌లో పరామర్శించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నిత్యం కూలీల సంక్షేమం కోసం కృషి చేసే ఉపాధి హామీ పథక ఉద్యోగులకు రెగ్యులర్ వేతనాలు ఇవ్వకపోవడం రేవంత్‌రెడ్డి సర్కారు ఆర్థిక దుస్థితికి నిదర్శనమన్నారు.