
గొర్రెల షెడ్డుపై తెగిపడిన విద్యుత్ తీగ..
● షార్ట్ సర్క్యూట్‌తో జీవాలు మృత్యువాత
నెక్కొండ: గొర్రెల షెడ్డుపై 11 కేవీ విద్యుత్ తీగ తెగిపడడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి జీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున మండలంలోని పెద్దకొర్పోలులో జరిగింది. గ్రామస్తులు, బాధితురాలు నూకల లక్ష్మి కథనం ప్రకారం.. లక్ష్మి ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన గొర్రెల షెడ్డుపై 11 కేవీ విద్యుత్ లైన్ వెళ్లింది. ఈ క్రమంలో ఇన్సూరేటర్ ఫెయిల్ కావడంతో విద్యుత్ తీగ తెగి పడింది. దీంతో షెడ్డు షార్ట్ సర్క్యూట్‌కు గురవడంతో 18 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో సుమారు రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితురాలు బోరున విలపించింది. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరింది. కాగా, గతంలోనూ ఇళ్ల పైనుంచి వెళ్లిన 11 కేవీ విద్యుత్ లైన్‌ను, ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించాలని పలుమార్లు తెలిపినా అధికారులు స్పందించలేదని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.