
మహబూబాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన సవాళ్లపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. తాము చేసిన సవాల్‌కు సిద్ధమేనని, కాకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభకు వచ్చి చర్చకు సిద్ధంగా కావాలన్నారు. ప్రజల పట్ల ఏ మాత్రం నిబద్ధత ఉన్నా మాజీ సీఎం కేసీఆర్ శాసనసభకు రావాలని, తాము కూడా లెక్కలతో సహా వస్తామని, శాసనసభలోనే తేల్చుకుందామన్నారు మల్లు.
ఈ మేరకు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘ ఒక పెద్ద మనిషి హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వచ్చి సవాళ్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పింది ఏంటి...! నీకు అర్ధం అయ్యింది ఏంటి..?, ముఖ్యమంత్రి.. మాజీ ముఖ్యమంత్రిని రమ్మని సవాల్ విసిరితే ఆయన్ను రానివ్వడం లేదు. CM సవాల్ ను జీర్ణించుకోలేక పోతున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలవాలి. కేసీఆర్‌ను రమ్మంటే ఆయన్ను రానివ్వకుండా ప్రెస్ క్లబ్ ఎవరో వచ్చి సవాళ్లు చేస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రెస్‌క్లబ్‌కు రమ్మంటావా?, ముఖ్యమంత్రి రేవంత్.. మాజీ ముఖ్యమంత్రిని చర్చకు రమ్మని స్పష్టంగా చెప్పారు.. ముఖ్యమంత్రికి ఏ బేసిన్ గురించి తెలియదు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా.. గోదావరి.. కృష్ణా జలాలు.. బేసిన్ గురించి.. ప్రజలకు తెలియ జేయడానికి చర్చించడానికి సిద్ధం. అసెంబ్లీలో చర్చకు మాజీ ముఖ్యమంత్రి రావాలి’ అని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.