
ప్రైవేట్ పాఠశాల బస్సు అడ్డగింత..
గ్రామస్తులతో కలిసి బస్సును అడ్డుకున్న టీచర్లు
డోర్నకల్: మండలంలోని తెల్లబండతండాలో సోమవారం ప్రైవేట్ పాఠశాల బస్సును గ్రామస్తులతోపాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. చిలుకోడుకు చెందిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం.. ప్రభుత్వ పాఠశాలలపై దుష్ప్రచారం చేస్తూ విద్యార్థుల సంఖ్య పెంచుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాయమాటలు చెప్పి ప్రైవేట్‌లో చేర్పించుకుంటున్నారని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చిలుకోడు ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు తలారి విద్యాసాగర్, రాములు, తెల్లబండతండా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సునీత, శంకర్ తదితరులు గ్రామస్తులతో కలిసి ప్రైవేట్ బస్సును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. దీనిపై తల్లిదండ్రులు స్పందించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.