
అన్నదాతల అగచాట్లు..
దుగ్గొండి: వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు పంటలకు ఊపిరి పోశాయి. దీంతో రైతులు పంటలకు వేయడానికి ఎరువుల కోసం చూస్తున్నారు. ఇదే క్రమంలో యూరియా కొరత ఉందని, ఒక రైతుకు నెలకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తామని ప్రచారం కావడంతో అన్నదాతలు ఒక్కసారిగా యూరియా కోసం ఎగబడ్డారు. బుధవారం మండలంలోని మందపల్లి, దుగ్గొండి, మహ్మదాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 20 టన్నుల చొప్పున యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు గురువారం తెల్లవారుజాము నుంచే గోదాముల వద్ద బారులు తీరారు. అయితే ఒక రైతుకు రెండు బస్తాల యూరియా మాత్రమే ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారని, అంతకంటే ఒక్కబస్తా కూడా ఎక్కువ ఇచ్చేది లేదని పీఏసీఎస్ సిబ్బంది తెలిపారు. దీంతో చేసేది ఏమీ లేక రైతులు క్యూలో నిలబడి రెండు బస్తాల చొప్పున తీసుకెళ్లారు. పైగా రెండు బస్తాల యూరియా కావాలంటే అరలీటర్ నానో యూరియా లింకు పెట్టి మరీ అమ్మకాలు సాగించారు. కాగా, యూరియా విక్రయ కేంద్రాల వద్ద జిల్లా వ్యవసాయ శాఖ అఽధికారి పేరిట ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధను వివరణ కోరగా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న ఆ ఆడియో తనది కాదని, అది ఫేక్ అన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు. జిల్లాలో యూరియా నిల్వ లు సరిపడా ఉన్నాయని తెలిపారు. యూరియా లేదని, దొరకదనే ప్రచారాన్ని నమ్మి అవసరం లేకున్నా తీసుకోవద్దని సూచించారు. రైతుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూరియాను పీఏసీఎస్‌లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల్లో తీసుకోవచ్చని ఆమె తెలిపారు.
యూరియా కోసం బారులు
రెండు బస్తాలకు మించి
ఇవ్వలేమంటున్న సొసైటీ సీఈఓలు