
పిల్లలకు పుస్తకాలు కొనుగోలు చేసి వెళ్తూ..
స్టేషన్‌ఘన్‌పూర్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన పిల్లలకు నోట్ పుస్తకాలు కొనుగోలు చేసి వెళ్తున్న క్రమంలో తండ్రి అనంతలోకాలకు చేరాడు. బైక్‌పై వెళ్తూ ముందు వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొట్టి కిందపడ్డాడు. అదే సమయంలో ఆర్టీసీ బస్సు మీది నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన బుధవారం ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జిట్టెగూడెం తండాకు చెందిన లావుడ్య కుమార్(32) తన పిల్లలకు నోట్ పుస్తకాలతో పాటు ఇతర సామగ్రి కొనుగోలు చేసేందుకు సమీపంలోని నారాయణలొద్ది తండాకు చెందిన లకావత్ భిక్షపతితో కలిసి తన బైక్‌పై స్టేషన్‌ఘన్‌పూర్ వచ్చాడు. పుస్తకాలు కొనుగోలు చేసిన అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో తిరిగి జిట్టెగూడెం తండాకు బయలుదేరాడు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ మోడల్ కాలనీ సమీపాన జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టి ఇద్దరు బైక్‌తో సహా రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో హనుమకొండ నుంచి జనగామ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు రోడ్డుపై పడిన వారిపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా భిక్షపతికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటనపై ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తతో బస్సు నడిపి తన భర్త మృతికి కారణమయ్యాడనే మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు. కాగా, మృతుడికి ఐదేళ్లలోపు వయసున్న కుమారుడు జనార్ధన్, కుమార్తె జాను ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం
మరొకరికి తీవ్ర గాయాలు
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఘటన