
అప్పు అడిగినందుకు అంతమొందించారు
గూడూరు : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ జి.సూర్యప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని సర్కిల్ పోలీసు స్టేషన్‌లో శుక్రవారం మండలంలోని గుండెంగ శివారు పంతుల్య తండాకు చెందిన తేజావత్ భద్రు హత్య కేసు వివరాలను సీఐ వివరించారు. పంతుల్యతండాకు చెందిన భద్రు మంగళవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతడి భార్య నీల బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం ఉదయం తండా సమీపంలోని వ్యవసాయ బావిలో భద్రు శవమై కనిపించగా, పోలీసులు హత్యకేసుగా నమోదు చేశారు. కానీ అంతకు ముందే పంతుల్యా తండాకు చెందిన తేజావత్ వీరేందర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనతో పాటు మరో ముగ్గురు తేజావత్ భద్రును చంపినట్లు నేరం ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. వెంటనే విచారణ చేపట్టగా, భద్రు వద్ద రూ.50 వేలు అప్పు తీసుకున్న వీరేందర్ డబ్బులు అడుగుతున్నాడనే కోపంతో అదే తండాకు చెందిన తేజావత్ సురేష్‌కు చెప్పుకున్నాడు. గతంలో భద్రుపై కోపంతో ఉన్న సురేష్, వీరేందర్‌తో కలిసి పథకం పన్నారు. ఈక్రమంలో అదే తండాకు చెందిన తేజావత్ కిషన్, బాదావత్ ఈర్య వారికి సహకరించగా, మద్యం తాగిఉన్న భద్రు మెడకు టవల్ చుట్టి ఊపిరాడకుండా చేసి చంపామని, అనంతరం సమీపంలోని వ్యవసాయ బావిలో వేశామని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ అనంతరం హత్యకు పాల్పడిన తేజావత్ వీరేందర్, తేజావత్ కిషన్, తేజావత్ సురేష్, బాదావత్ ఈర్యలను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సూర్యప్రకాశ్ తెలిపారు. గూడూ రు ఎస్సై గిరిధర్‌రెడ్డి, కొత్తగూడ ఎస్సై కుషకుమార్, ట్రెయినీ ఎస్సై కోటేశ్వర్‌రావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
భద్రు హత్య కేసులో నిందితుల అరెస్ట్