
రైతులు ధైర్యంగా ఉండండి..
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి నియోజకవర్గంలో అకాల వర్షాలతో తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం సాయంత్రం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి, కర్కపల్లి భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో తడిసిన వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. లారీలు సమయానికి రాక కల్లాలోనే వరి ధాన్యం ఉంటుందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, సివిల్ సప్లై అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఎస్‌ఓ శ్రీనాథ్, డీఎం సివిల్ సప్లై అధికారి రాములు, డీసీఓ వాల్యానాయక్‌లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు ఏర్పాటు చేయాలన్నారు. మిల్లర్లు సన్న వడ్లను దింపుకునేలా చూడాలని కోరారు. లారీల కొరత లేకుండా చూసి, ధాన్యాన్ని వెంటనే తరలించాలని ఆదేశించారు.
తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం..
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు