
రైతు ర్యాలీకి అనుమతిని పరిశీలించండి
● వరంగల్ పోలీసులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న రైతు ర్యాలీ, బహిరంగ సభ నిర్వహణ కోసం తెలంగాణ రైతు సంఘం పెట్టుకున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవాలని వరంగల్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. శాంతియుత ర్యాలీ, సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ రైతు సంఘం నాయకుడు మోర్తాల చందర్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ. ‘ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్‌లోని కార్మిక మైదానంనుంచి సాయి కన్వెన్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో 800 మంది రైతులు పాల్గొనే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆజంజాహీ మిల్లు మైదానంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనిపై పలుమార్లు దరఖాస్తు చేసినా పోలీసులు ఎలాంటి నిర్ణయమూ చెప్పలేదు. అందుకే విధిలేక కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది’ అని చెప్పారు. మరోవైపు కలెక్టర్ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) ఉంటే తప్ప ర్యాలీకి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కలెక్టర్ నుంచి ఎన్‌ఓసీ సమర్పించిన తర్వాత మే 17న సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తును పరిగణనలోకి తీసుకుని అనుమతిని పరిశీలించాలని పోలీసులను ఆదేశించారు. చట్టప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.
పనులు త్వరగా పూర్తి చేయండి
నయీంనగర్ : గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ జాన్‌పాకలో జరుగుతున్న ఇన్నర్ రింగ్ రోడ్, కల్వర్టు పనులను కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. అలాగే వరంగల్ బస్‌స్టేషన్ నిర్మాణ పనులను, పరిసరాలను పరిశీలించి వర్షాకాలం సమీపిస్తుండటంతో పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
ముగ్గురిపై గృహ హింస కేసు
మహబూబాబాద్ రూరల్: ఓ వివాహితను అదనపు కట్నం కోసం ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై గృహహింస చట్టం కేసు నమోదు చేశామని మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీటీఆర్ నగర్ కాలనీ చెందిన దుంప స్వప్నకు ఖమ్మం జిల్లా కేంద్రం శివారులోని మారెమ్మ గుడి ప్రాంతానికి చెందిన వంశీతో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన సమయంలో రూ.3లక్షలు కట్నంగా ఇచ్చారు. డబ్బులు సరిపోవటం లేదంటూ మరో రూ.5లక్షలు తేవాలంటూ స్వప్నను వంశీ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఈక్రమంలో ఆమె భర్త వంశీ, అత్తమామలు వెంకన్న అలివేలుపై చర్య తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయగా టౌన్ ఎస్సై అలీంహుస్సేన్ కేసు నమోదు చేశారు.