దూసుకొచ్చిన మృత్యువు.. | - | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు..

May 23 2025 5:31 AM | Updated on May 23 2025 5:31 AM

దూసుక

దూసుకొచ్చిన మృత్యువు..

కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి నది పుష్కర స్నానానికి వస్తూ ఇద్దరు భక్తులు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. జయశంకర్‌భూపాలపల్లి కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో కమలాపూర్‌ క్రాస్‌ సమీపంలో జాతీయ రహదారి 353(సి)పై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాళేశ్వరం నుంచి హైదరాబాద్‌కు భక్తులతో వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఆటోలో ప్రయాణిస్తున్న మిగిలినవారు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కుమ్మరిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన గుంటుక నరసింహ, ఆయన భార్య సంధ్య, అక్క శ్రీరాముల శోభ, చెల్లి పాల రజిత(28), శోభ కుమారుడు విష్ణు(21), కుటుంబ సభ్యులు మణెమ్మ, వివన్‌, శాన్విత, విశృత్‌, మోక్షిత్‌లు ఆటోలో కాళేశ్వరం పుష్కర స్నానం కోసం బయల్దేరారు. అదేసమయంలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు భక్తులు పుష్కర స్నానం చేసి కారులో తిరుగుప్రయాణమయ్యారు. మేడిపల్లి అటవీ ప్రాంతంలో కమలాపూర్‌ క్రాస్‌ సమీపంలో కారు డ్రైవర్‌ విశ్వాంత్‌ అతివేగంతో ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీ కొట్టాడు. దీంతో ఆటో ఎగిరిపడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న పదకొండు మందికి గాయాలపాలయ్యారు. వీరిలో పాల రజిత, శ్రీరాముల విష్ణులకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో భూపాలపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా రజిత, విష్ణు మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి సైతం తీవ్రగాయాలైనట్లు తెలిసింది. క్షతగాత్రులు భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హనుమకొండలో ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సైలు అభినవ్‌, గీతారాథోడ్‌ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అలుముకున్న విషాదఛాయలు..

చిట్యాల: మేడిపల్లి అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిట్యాల మండలం కుమ్మరిపల్లికి చెందిన పాల రజిత, శ్రీరాముల విష్ణు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన గుంటకు సమ్మయ్య చిన్న కూతురు రజితకు వివాహం కాగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. పుష్కర స్నానానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాలనే ఆశతో రజిత బుధవారం గ్రామానికి వచ్చింది. అదే విధంగా సమ్మయ్య పెద్ద కూతురు శోభ కుమారుడైన శ్రీరాముల విష్ణు హనుమకొండలో బీ.టెక్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చాడు. ఈక్రమంలో ఇలా ప్రమాదంలో మృతిచెందారు.

పుష్కరాలకు వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు

ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరి మృతి,

తొమ్మిది మందికి గాయాలు

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు

కాటారం మండలం మేడిపల్లి అటవీ ప్రాంతంలో ఘటన

దూసుకొచ్చిన మృత్యువు.. 1
1/3

దూసుకొచ్చిన మృత్యువు..

దూసుకొచ్చిన మృత్యువు.. 2
2/3

దూసుకొచ్చిన మృత్యువు..

దూసుకొచ్చిన మృత్యువు.. 3
3/3

దూసుకొచ్చిన మృత్యువు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement