Stray Dog: ఊరకుక్కలకో ఊరడింపు | Special Story On Stray Dog | Sakshi
Sakshi News home page

Stray Dog: ఊరకుక్కలకో ఊరడింపు

May 25 2025 12:22 PM | Updated on May 25 2025 12:22 PM

Special Story On Stray Dog

13 ఏళ్లుగా పెంపకం 

 3 వేలపైగా కుక్కల దత్తత  

ఎక్కడైనా వీధి కుక్కలకు ప్రమాదం జరిగితే సొంత ఖర్చులతో వైద్యం

మహబూబాబాద్‌ అర్బన్‌: ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది. కొందరికి మొక్కలు పెంచడం, ఇంకొందరికి జంతువులు, పక్షులను సాకడం ఇష్టం. కాగా పింగిలి శ్రీనివాస్, ఆయన కూతురు దీపిక మాత్రం శునకాలను పెంచడం ఇష్టంగా మార్చుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరూ శునకాల ప్రేమికులే కావడం విశేషం.  

ఖమ్మం నుంచి తీసుకొచ్చి..  
మానుకోట మున్సిపల్‌ పరిధిలోని ఈదులపూసపల్లికి చెందిన పింగిలి శ్రీనివాస్‌–ప్రసన్నలక్ష్మి దంపతులకు కూతురు దీపిక, కుమారుడు ఉన్నారు. శ్రీనివాస్‌ ప్రభుత్వ డ్రాయింగ్‌ ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తించి రిటైరయ్యారు. ఆయన ఒకరోజు ఖమ్మంలోని తన బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ ఇంద్రనగర్‌ కాలనీలో సైడ్‌ డ్రెయినేజీ వద్ద చిన్న కుక్కపిల్ల శ్రీనివాస్‌ కంటపడగా.. దానిని ఇంటికి తీసుకొచ్చారు. ఆయన కూతురు దీపిక.. ఆ కుక్క పిల్లను ప్రేమగా దగ్గరికి తీసుకొని.. స్నానం చేయించి పాలు, బిస్కెట్లు అందించింది. కుక్కపిల్ల నోటినుంచి నురగ కారడంతో పాటు కురుపులు కావడంతో వెంటనే పశువైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడి సూచన మేరకు ఖమ్మంలో పశువైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించి శునకానికి క్యాన్సర్‌ ఉందని తేల్చారు. దీంతో హైదరాబాద్, ముంబై వైద్యులు చికిత్స చేయగా కోలుకుంది. కాగా దానికి దీపిక ముద్దుగా టాఫీ అని నామకరణం చేసి పెంచుకుంది. ఇలా వారి కుటుంబానికి కుక్కల పెంపకంపై మక్కువ పెరిగింది. వీధికుక్కలు, అనారోగ్యానికి గురైన వాటిని చేరదీసి వాటి ఆలనాపాలన చూస్తున్నారు. 

 అనాధ శునకాలకు ఆలంబన 
మానుకోట జిల్లా కేంద్రంలో లక్ష్మి థియేటర్‌ వద్ద గర్భం దాల్చిన వీధి కుక్క కనిపించింది. తండ్రి శ్రీనివాస్, కూతురు దీపిక దాన్ని ఇంటికి తీసుకెళ్లి వైద్యం అందించారు. నెహ్రూసెంటర్‌లో మరో కుక్క పిల్ల కనిపించగా.. దాన్ని కూడా తీసుకెళ్లి పెంచుతున్న క్రమంలో ఒకరోజు కిందపడిపోయింది. దానిని పశువైద్యశాలకు తీసుకెళ్లగా శునకానికి మూర్ఛరోగం ఉందని తెలిపారు. ఆ కుక్కను హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి రూ.25 వేల వరకు వెచి్చంచి చికిత్స అందించారు. ఆ తర్వాత గర్భం దాలి్చన వీధి కుక్క 7 పిల్లలకు జన్మనిచి్చంది. అనంతరం వాటిని ఇంటికి తీసుకురాగా.. సందడి నెలకొంది. కుటుంబ సభ్యులందరూ సంతోషంగా వాటి మధ్యలో ఆడుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఇలా ఎక్కడ వీధి కుక్కలు అనారోగ్యంతో కనిపించినా.. వాటిని ఇంటికి తీసుకొచ్చి స్నానం చేయించి, సొంత డబ్బులతో మంచి వైద్యం అందించి ఆరోగ్యంగా తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 3వేల కుక్కలను దత్తత ఇచ్చారు. వారి కుటుంబం ప్రస్తుతం సుమారు 40 కుక్కలను పెంచుతోంది.  

 దంపతులిద్దరూ శునకాల సేవలో.. 
పింగిలి దీపిక 13 ఏళ్లుగా శునకాలను పెంచుతోంది. కాగా ఆమెకు 2020లో మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన ఇమామ్‌పాషాతో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇమామ్‌పాషా కూడా ఆమెకు సహకరిస్తున్నారు. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయత్రం తానే దగ్గరుండి చూసుకుంటూ.. భోజనంతో పాటు మందులు వేస్తున్నారు.

కుక్కల కోసం యూట్యూబ్‌ చానల్‌ 
నాకు కుక్కలు, వాటి పిల్లలు అంటే చాలా ప్రేమ. మొదట మా నాన్న కుక్క పిల్లను తీసుకువచ్చాడు. దాంతో నాకు కుక్కలంటే ప్రేమ పెరిగింది. నేను మొదట మ్యారేజ్‌ ఈవెంట్స్‌ చేసేదాన్ని. అలా వచి్చన డబ్బులతో కుక్కలకు వైద్యం, స్నాక్స్, భోజనం అందించేదాన్ని. ప్రస్తుతం చాలా కుక్కలు ఇంట్లో ఉండడంతో.. నాన్న పెన్షన్‌ డబ్బులతో వాటికి అన్ని రకాల భోజనం అందిస్తున్నాను. నేను పెంచుతున్న వీధి కుక్కలకు ఏదో ఒక రోగం ఉంటోంది. గుండె, లివర్, క్యాన్సర్, పిడుసు లాంటి రోగాల బారిన పడి ఉన్నాయి. వాటిని హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌ ఆస్పత్రికి కారులో తీసుకెళ్లి.. మంచి వైద్యం అందిస్తాను. ఎవరికి కుక్కలు కావాలన్నా ఈదులపూసపల్లికి వచ్చి దత్తత తీసుకుంటారు. ప్రత్యేకంగా కుక్కల కోసం నా పేరుతోనే సొంతంగా యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించాను. 
 – పింగిలి దీపిక, శునకాల సంరక్షకురాలు

మా బిడ్డకు ఇష్టమని.. 
నేను మొదటిసారిగా చిన్న కుక్క పిల్లను 
ఇంటికి తీసుకువస్తే.. మా అమ్మాయి దీపిక దానిపై ఎనలేని ప్రేమ పెంచుకుంది. అప్పటి నుంచి నేను ఎక్కడికి వెళ్లినా.. అనారోగ్యంతో వీధి కుక్కలు కనిపిస్తే ఇంటికి తీసుకెళ్తాను. వాటికి చికిత్స అందించి ఆరోగ్యవంతంగా మారిన తర్వాత.. తిరిగి బయటకు పంపించడం లేదా ఇంట్లోనే పెంచుతాను. నా పెన్షన్‌ డబ్బులతో వాటికి మంచి పౌష్టికాహారం అందిస్తాను. అవి ఇంట్లో సందడి చేస్తాయి.  పింగిలి శ్రీనివాస్, ఈదులపూసపల్లి

మా పిల్లలుగా భావిస్తాం 
దీపికకు నాకు వివాహమై ఐదు సంవత్సరాలు అవుతోంది. నాకు కూడా జంతువులంటే ప్రేమ. మా ఇద్దరినీ.. జంతువులపై ఉన్న ప్రేమే కలిపింది. రోజూ ఉదయం 9 గంటలకు కుక్కలకు స్నానం తర్వాత టానిక్, మందులు వేస్తాను. 10 గంటలకు ఎగ్, చికెన్‌ బిర్యానీ, కూరగాయలతోనే చక్కటి భోజనం పెడతాను. మధ్యాహ్నం స్నాక్స్, బిస్కెట్లు, ఇంట్లో తయారు చేసిన మురుకులు, అప్పాలు పెడతాను. సాయంత్రం 5గంటలకు భోజనం, రాత్రి 8 గంటలకు మందులు, పాలు అందిస్తాం. వీధి కుక్కలను ప్రేమ చూసుకుంటాను.  
– ఎండీ ఇమామ్‌పాషా. మానుకోట 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement