
పెళ్లికి వెళ్లొస్తూ.. కానరాని లోకాలకు
నల్లబెల్లి : పెళ్లికి వెళ్లొస్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో కానరాని లోకాలకు వెళ్లాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరు గాయపడ్డాడు. ఈ ఘటన శనివారం నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన భూస కుమార్ (40), పెండ్లి రాజు ద్విచక్రవాహనంపై నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి శివారు ఒల్లెనర్సయ్యపల్లిలో బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. వేడుక పూర్తయిన అనంతరం ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మల్లంపల్లి నుంచి నర్సంపేట వైపునకు వెళ్తున్న లారీ రుద్రగూడెం శివారులోని జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో కుమార్ లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు గాయాలుకావడంతో స్థానికులు నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ
ఒకరి మృతి.. మరొకరికి గాయాలు