
సమగ్ర కీటక నివారణపై కేవీకేలో శిక్షణ
మామునూరు: మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ములుగు జిల్లాకు చెందిన ఫర్టిలైజర్ డీలర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఖరీఫ్ పంటల్లో సమగ్ర కీటక వ్యాధి నివారణ (ఐపీడీఎం) పై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న ముఖ్యఅతిథిగా హాజరై ఐపీడీఎం సిద్ధాంతాలు, పద్ధతులు, రసాయనాల చట్టాలు, నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం మల్చింగ్ యూనిట్ ఫీల్డ్ విజిట్ నిర్వహించారు. అక్కడ కూరగాయల పంటల్లో ప్రధాన కీటకాలు, వ్యాధులను గుర్తించడం, వాటి నిర్వహణ పద్ధతుల గురించి వివరించారు. జె.సాయి కిరణ్ అజొల్లా తయారీ, పశువులకు ఇచ్చే ఆహార నియమాలు, అనువైన మేత గురించి కేవీకేలోని డెమో యూనిట్లలో వివరించగా.. డాక్టర్ గణేశ్ చేపల పెంపకం, వాటి నీటి, ఆహారం, ఆరోగ్య నిర్వహణ గురించి వివరించారు. కార్యక్రమంలో డీలర్లు, ఏఈఓలు పాల్గొన్నారు.