తూకాల్లో మిల్లర్ల మోసం.. రైతుల ఆందోళన
నర్సింహులపేట: మిల్లర్లు ధాన్యం తూకాల్లో మోసం చేయడంతో రైతులు ఆందోళన చేసిన ఘటన మండలంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని గోపతండా సమీపంలోని వెంకటేశ్వర బాయిల్డ్ రైస్ మిల్లు నిర్వాహకులు పెద్దనాగా రం శ్రీశ్రీబాయిల్డ్ రైస్ మిల్లు వద్ద ఉన్న వేబ్రిడ్జిపై తూకం వేసి కొనుగోలు చేస్తున్నారు. కాగా, ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వేసిన తూకానికి సుమారు క్వింటాకు 3కిలోల చొప్పున పెద్దనాగారం శ్రీశ్రీ పారాబాయిల్డ్ రైస్ మిల్లులోని వేబ్రిడ్జిలో తక్కువ రావడం గమనించిన రైతులు దంతాలపల్లిలోని వేబ్రిడ్జిలో తూకం వేశారు. అక్కడ ఐకేపీలో వేసిన తూకానికి సమానంగా వచ్చింది. దీంతో శ్రీశ్రీ పారాబాయిల్డ్ రైస్ మిల్లు వద్ద దంతాలపల్లి, నర్సింహులపేట, చిన్నగూడూరు, మరిపెడకు చెందిన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రెండు మిల్లుల యజమానులు ఒకటై తమను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈక్రమంలో వందలాది ట్రాక్టర్లు, లారీలు మిల్లు వద్ద నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తూనికలు, కొలతల జిల్లా అధికారి విజయ్‌కుమార్ సంఘటన స్థలానికి వచ్చి మిల్లుల యజమానులు, రైతులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.


