
గుర్తూరులోని ఆదర్శ పాఠశాల
తొర్రూరు: ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు ఈ నెల 7న పరీక్ష నిర్వహించారు. అలాగే ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు ఖాళీల భర్తీకి సైతం అదే రోజు పరీక్ష జరిగింది. జిల్లా వ్యాప్తంగా 8 ఆదర్శ పాఠశాలలు ఉండగా 800 సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. నిపుణులైన బోధకులు ఉండడంతో ఉత్తమ విద్య అందుతుందని ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే వసతి సౌకర్యాలు లేకపోవడంతో ఆ తర్వాత ఇబ్బందులు పడుతున్నారు.
2013లో ప్రారంభం...
జిల్లాలో 2013లో ఆదర్శ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని తొర్రూరు, మహబూబాబాద్, మరిపెడ, నర్సింహులపేట, కురవి, డోర్నకల్, కేసముద్రం, నెల్లికుదురు మండలాల్లో ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశారు. మొదట స్థానికేతరులందరికీ వసతి కల్పిస్తామని చెబుతూ ప్రవేశాలు ఇచ్చారు. ఆ తర్వాత 100మందికే అదికూడా బాలికలకే వసతి కల్పిస్తున్నారు. తర్వాత అందరికీ వసతి కల్పిస్తామని చెబుతూ వచ్చారు. పాఠశాలలు ప్రారంభమై 11 ఏళ్లు దాటినా సమస్యలు ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ప్రతి పాఠశాలలో 1,320 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తారు. ఇందులో ఆరు నుంచి పదో తరగతి వరకు 1,000 మంది ఉంటారు. బాలురకు సమానంగా బాలికలు ప్రవేశం పొందుతూ వస్తున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నందున ప్రతి పాఠశాలలో జిల్లా నలుమూలల నుంచి ప్రవేశాలు స్వీకరిస్తారు. అయితే వసతి లేకపోవడంతో ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం 100మందిబాలికలకే వసతి కల్పిస్తున్నారు. మిగిలిన వారు నిత్యం రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఆయా మండలాల పరిధిలోని విద్యార్థులైతే ఎలాగో రోజూ బస్సు లేదా ప్రైవేట్ ఆటోలను మాట్లాడుకుని వచ్చి వెళ్తారు. ఇతర మండలాల వారి పరిస్థితి ఇబ్బందిగా మారింది. వసతి లేక చాలా మంది ప్రవేశాలు రద్దు చేసుకుని ప్రైవేట్ పాఠశాలల్లో చేరుతున్నారు.
కొత్త ప్రభుత్వంపై ఆశలు..
కొత్త ప్రభుత్వమైన వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాలికలందరికీ వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం ఇంటర్, పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల పాఠశాలలు కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. ఉదయం, సాయంత్రం విద్యార్థులు రాకపోకలతోనే అలసిపోవాల్సి వస్తోంది. సాయంత్రం ఇళ్లకు చేరేసరికి చీకటి అవుతోంది. దీంతో తల్లిదండ్రులు పిల్లల కోసం నిత్యం ఆత్రుతతో ఎదురుచూడాల్సి వస్తోంది. వీటన్నింటికీ వసతి లేకపోవడమే కారణమని చెప్పవచ్చు. వసతిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
ఆదర్శ పాఠశాలల్లో వసతి కరువు
విద్యార్థులకు తప్పని ఇక్కట్లు
కేవలం 100 మంది బాలికలకే సౌకర్యం