● భర్తీకాని వైద్యుల పోస్టులు
● అరకొరగా ఎంఎల్‌హెచ్‌పీలు
● అందని స్టాఫ్‌నర్సుల సేవలు
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలోని జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎం)లో చాలా వరకు పోస్టులు ఖాళీగా మారాయి. ఫలితంగా ఆయా విభాగాల్లో వైద్యసేవలు అందకపోవడంతో ప్రజలు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను కొన్నేళ్లుగా జాతీయ ఆరోగ్య మిషన్‌గా మార్చి ఆరోగ్య కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇందులో నియమితులైన వైద్యులు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. కొంత కాలంగా ఈ విభాగంలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఉన్న వారికి సైతం అరకొరగా జీతాలు వస్తుండటంతో వారు ఇతర అవకాశాలు రాగానే ఈ ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోతున్నారు. ఈ కారణంగా ప్రజలు, రోగులు వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీ
జాతీయ ఆరోగ్య మిషన్‌లో 428 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఉన్నాయి. ప్రతి క్లినిక్‌లో ఒక ఎంఎల్‌హెచ్‌పీ విధులు నిర్వహిస్తున్నారు. వారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్యాన్ని అందిస్తూ సేవలందిస్తున్నారు. ఈ మేరకు వారికి నెలకు రూ.25వేలు జీతం ఇస్తున్నారు. అయితే గత కొంత కాలంగా జిల్లా వ్యాప్తంగా 33 చోట్ల ఖాళీలు ఉన్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు వైద్యసేవలు అందడం లేదు. ఈ కారణంగా వారు వ్యయ ప్రయాసలకు ఓర్చి పక్క గ్రామాలకు వెళ్లి వైద్యసేవలు అందుకోవాల్సి వస్తోంది. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ), ఎస్‌ఎన్‌సీయూ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌ఐసీయూ, ఎన్‌సీడీలలో ఏకంగా 48 స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ కారణంగా ఆయా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలు కొండెక్కాయి. సాధారణంగా చాలా ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులతో సమానంగా స్టాఫ్‌నర్సులు వైద్యసేవలు అందిస్తూ ఉంటారు. పోస్టులు భారీగా ఖాళీగా ఉండటంతో గర్భిణులు, మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చాలా తక్కువగా
నాల్గవ తరగతి ఉద్యోగులు
జిల్లాలో ఐదు సీహెచ్‌సీలు ఉండగా వాటిలో ఎనిమిది డాక్టర్ల పోస్టులు ఖాళీగా మారడంతో వైద్యసేవలు అంతంత మాత్రంగా రోగులకు అందే పరిస్థితి నెలకొంది. వీరితో పాటు పలు ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్‌ఎంలు, జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఫీల్డ్ ఇన్విస్టిగేటర్, డెంటల్ టెక్నీషియన్, నాల్గవ తరగతి ఉద్యోగులు చాలా తక్కువగా ఉన్నారు. రోగులు, ఉద్యోగులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని మాస్ మీడియా విభాగంలో లీగల్ కన్సల్టెంట్ పోస్టు సైతం ఖాళీ ఉంది. ఫలితంగా న్యాయ సలహాలు, పరిష్కారాలు ఆలస్యం అవుతున్నాయి.
ఉద్యోగులపై పనిభారం
జాతీయ ఆరోగ్య మిషన్‌లో భారీగా ఖాళీలు ఏర్పడటంతో ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతోంది. దీంతో వారు అదనపు పనిగంటలు పనిచేయాల్సి వస్తోంది. ఈ కారణంగా వారు నిత్యం పనిలోనే నిమగ్నమై ఉండటంతో త్వరగా దీర్ఘకాలిక వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. చిన్న వయస్సులోనే చాలా మంది బీపీ, షుగర్, థైరాయిడ్ వ్యాధుల బారిన పడుతున్నారు. తమ జీతాలు పెంచాలని జాతీయ ఆరోగ్య మిషన్‌లో పనిచేసే ఉద్యోగులు పలు మార్లు ఆందోళనలు చేసినా ఫలితం ఉండటం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమమైనా జీతాలు పెంచమని రాష్ట్రం కోరితే ఆ భారం రాష్ట్ర ఖజానాపై కూడా భారం పడుతుంది. ఎందుకంటే వీరి జీతాలు 60ః40 రేషియోలో ఇస్తారు కాబట్టి కేంద్రం జీతం పెంచితే రాష్ట్రం కూడా పెంచాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వానికి జీతాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మంచి అవకాశం వస్తే రాజీనామా
జాతీయ ఆరోగ్య మిషన్‌లో వెట్టి చాకిరి చేసే దానికన్నా మంచి అవకాశం వస్తే రాజీనామా చేసేందుకు సైతం కొందరు ఉద్యోగులు వెనుకాడటం లేదు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఖాళీ అయిన ఉద్యోగాలన్నీ ఇలా మంచి అవకాశాలు రావడంతో రాజీనామా చేసి వెళ్లిపోయినవేనని సహ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్‌కు రూ.61,960, స్టాఫ్‌నర్సుకు రూ.27,835, ఎంఎల్‌హెచ్‌పీలకు రూ.25వేలు మాత్రమే జీతం ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని పెంచాలని కోరినా వినేవారు కరువవడంతో ఇతర రంగాల్లో మంచి అవకాశాలు వస్తే రాజీనామా చేయడానికి చాలా మంది వెనుకాడటం లేదన్న విమర్శలు ఉన్నాయి.


