సమస్యను పరిష్కరిస్తాం
● బ్లాక్‌లో విక్రయాలు
● ప్రజలకు తప్పనితిప్పలు
నంద్యాల(అర్బన్): జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్టాంపు పేపర్ల కొరత వేధిస్తోంది. ఇదే అదనుగా మూడు రెట్లు అదనపు ధరలతో కొందరు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు. మరి కొందరు పెద్ద సంఖ్యలో నిల్వచేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో రెండు నెలలుగా స్టాంపుల కొరత ఉన్నా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోయారు. ఈ నెల 1వ తేదీ నుంచి పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అరొకరగా వస్తున్న వాటిని తమకు అనుకూలంగా ఉన్నవారికి పెద్ద మొత్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన వారు బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సివస్తోంది. స్టాంపుల బ్లాక్ మార్కెట్‌ను అధికారులు అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇష్టానుసారంగా ధరలు
జిల్లాలోని బండిఆత్మకూరు, శిరివెళ్ల, ఆళ్లగడ్డ, పాణ్యం, డోన్, ప్యాపిలి, బగానపల్లె, బేతంచెర్ల, అవుకు, కోవెలకుంట్ల, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్టాంపులు దొరకకపోవడంతో క్రయవిక్రయ దారులు ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచడంతో వారు వాటిని కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్‌లో స్టాంపులు కొనుగోలు చేయాల్సిరావడం భారంగా మారింది. నాన్ జ్యుడీషియల్ స్టాంపుల కొరతతో ధరలు ఇష్టానుసారంగా పెంచారు. ఇదే పరిస్థితి కొనసాగితే అఫిడవిట్లు, ఒప్పందాలు, లీజుపత్రాలకు స్టాంపులు దొరక్క నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని క్రయవిక్రయ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని స్టాంప్‌ల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు.
జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్టార్ కార్యాలయాలకు త్వరలో సంపూర్ణంగా స్టాంప్‌లు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే కొరత ఉంది. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తాం. బ్లాక్‌లో అదనపు ధరలకు స్టాంప్‌లు విక్రయిస్తే చర్యలు తప్పవు.
–అశోక్, జిల్లా రిజిస్ట్రార్, నంద్యాల


