పొలాలు బీడు భూములుగా మారాయి
బోర్లు ఎండిపోయాయి
● నీరు లేక ఎండిన ఏడు చెరువులు
● చెరువుల కింద బీడైన ఆయకట్టు
● పొలాల్లో అడుగంటిన వేలాది బోర్లు
గోనెగండ్ల: వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయి. వాటి చుట్టూ ఉన్న పంట పొలాలు బీళ్లుగా మారాయి. వ్యవసాయ బోర్లలో చుక్కనీరు రావడం లేదు. గోనెగండ్ల మండలంలో ప్రతి ఇంటా కన్నీటి చెమ్మ కనిపిస్తోంది. మండలంలో ఏడు చెరువులు ఉండగా గంజిహళ్లి ప్రధానమైంది. ఎర్రబాడులో రెండు, ఒంటెడుదిన్నెలో రెండు, చిన్న నేలటూర్‌లో ఒకటి, కున్నూరులో ఒకటి చొప్పున చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. చివరికి మూగజీవాలు తాగేందుకు కూడా నీరు లేకపోయింది. మండలంలో ఉన్న ఏడు చెరువుల కింద రెండు వేల ఎకరాలు బీళ్లుగా మారాయి. గంజిహళ్లి చెరువు కింద 160 ఎకరాల్లో గతంలో వరి సాగు చేసేవారు. నీళ్లు లేక పత్తివేసినా పూర్తిగా ఎండిపోయింది. ఎర్రబాడులో పాత చెరువు, కొత్త చెరువు కింద 200 ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఒంటెడుదిన్నె గ్రామంలో కానాల చెరువు, ఎర్ర చెరువు కింద పంటల సాగే లేదు. కన్నూరు(మాచాపురం) చెరువు కింద 800 ఎకరాలు ఎడారిని తలపిస్తున్నాయి. చెరువుల చుట్టూ ఉన్న దాదాపు 2వేల బోర్లు, బావులు ఎండిపోయాయి. దీంతో 10 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంత వరకు అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయలేదు. ఎండిపోయిన పంటలకు, దెబ్బతిన్న పంటలకు తగిన పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మా ఊరి చెరువుకు వర్షం నీటితో పాటు హంద్రీ–నీవా నీరు కూడా వస్తుంది. వర్షాలు లేకపోవడంతో వర్షం నీరు రాలేదు. హంద్రీ–నీవా నుంచి నీరు రాక చెరువు ఎండిపోయింది. చెరువు కింద సాగు భూములన్నీ బీళ్లుగా మారాయి.
– రాముడు, రైతు, ఎర్రబాడు గ్రామం
వర్షాలు రాక, చెరువుల్లో నీరు లేక బోర్లు ఎండిపోతున్నాయి. మా ఊరి చెరువు చుట్టు పక్కల ఉన్న బోర్లు, బావులు అన్నీ అడుగంటిపోయాయి. కొంతమంది అడపదడపా కురిసిన వర్షానికి పత్తి పంటను సాగుచేసుకున్నారు. అవికూడా ఎండిపోయాయి. రైతులకు పరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి.
– తోలు రాముడు, రైతు, గంజిహళ్లి గ్రామం


