కొత్తపల్లి: కొలనుభారతి దేవి క్షేత్ర అమ్మవారి హుండీ ఆదాయం రూ.3,76,373 వచ్చిందని శ్రీశైలం దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి జి.స్వాములు తెలిపారు. గురువారం శివపురం సమీపంలోని కొలనుభారతి క్షేత్ర ప్రాంగణంలో దేవదాయశాఖ అధికారి కార్తీక్ ఆధ్వర్యంలో అమ్మవారి హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ.. గత 7 నెలల 15 రోజులకు సంబంధించి హుండీని లెక్కింపు చేశామన్నారు. ఇందులో రూ.3,76,373 ఆదాయం వచ్చిందన్నారు. దీంతో పాటు 300 మిల్ల్లీ గ్రాముల బంగారు, 25 గ్రాముల వెండి అమ్మవారికి భక్తులు సమర్పించుకున్నారన్నారు. అయితే ఫిబ్రవరిలో హుండీ లెక్కించగా రూ. 2,17,635 ఆదాయం రాగా, ఇప్పుడు రూ.1,58,738 అదనపు ఆదాయం వచ్చిందన్నారు. ఈ మొత్తాన్ని అమ్మవారి ఖాతా లో భద్రపరుస్తామన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షకులు దేవిక, సిబ్బంది పాల్గొన్నారు.
నిమజ్జన వేళ విషాదం
● కేసీలో శవమై కనిపించిన వ్యక్తి
పగిడ్యాల: ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూనగర్‌లో బుధవారం రాత్రి జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో ప్రమాదవశాత్తు కేసీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. గ్రామానికి చెందిన బోయ టోపి చంద్రశేఖర్(55) గణేష్ నిమజ్జన విగ్రహాల ఊరేగింపు వెంబడి కేసీ కాలువకు చేరుకున్నాడు. కేసీ కాలువ వద్ద సరైన లైటింగ్ లేకపోవడం వలన ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహాలను చీకట్లోనే కేసీ కాలువలోకి నిమజ్జనం చేశారు. రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కేసీలోకి పడేసిన వినాయక విగ్రహాలపై తేలియాడుతూ కనిపించిన శవాన్ని భక్తులు కేకలు వేశారు. గణేష్ విగ్రహంపై ఉన్న శవాన్ని బయటకు తీసి చూడగా మృతుడు బోయ టోపి చంద్రశేఖర్‌గా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. విగ్రహాలతో పాటు ప్రమాదవశాత్తు కేసీలో పడి మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు, బంధువులు అనుమానానం వ్యక్తం చేశారు. విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతంలో ఎలాంటి లైటింగ్ లేదని చీకట్లోనే నిమజ్జన వేడుకలు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. మృతుని భార్య హైమావతి ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి ఎస్‌ఐ నరేంద్ర కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. అయితే చంద్రశేఖర్ మృతికి లైటింగ్ కారణం కాదని, ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ప్రమాదవశాత్తు జారి పడ్డాడని ఎస్‌ఐ రెండు విధాలుగా చెబుతుండటం విశేషం.
రంగాపురంలో యువకుడి హత్య
బేతంచెర్ల: మండల పరిధిలోని రంగాపురం గ్రామానికి చెందిన గంప ఎల్ల రమేష్ (24)ను కుటుంబీకులే దారుణంగా హత్య చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఎల్ల రమేష్ మద్యానికి బానిసై ఇంట్లో తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను వేధింపులకు గురిచేసేవాడు. బుధవారం మద్యం తాగి వచ్చిన రమేష్ తండ్రి లింగన్నను, అన్న శివ నారాయణతో ఘర్షణ పడి దాడి చేశాడు. అతని వేధింపులు తాళలేక తండ్రి, అన్న ఇద్దరూ కలిసి గురువారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో తాడుతో రమేష్ గొంతుకు బిగించి హత్య చేశారని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బేతంచెర్ల ప్రభుత్వ ఆస్నత్రికి తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
నీటి కుంటలో పడి వ్యక్తి మృతి
డోన్ టౌన్: మండలంలోని ఓబులాపురం బుధవారం జరిగిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బోయ రామాంజనేయులు(40) నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొని ప్రమాదవశాత్తూ నీటి కుంటలో పడి మృతి చెందినట్లు రూరల్ సీఐ రాకేష్ తెలిపారు. గురువారం ఉదయం కుంట వైపు వెళ్లిన వారు నీటిలో తేలాడుతున్న శవాన్ని గమనించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌లో ముగ్గు వ్యాపారం చేస్తున్న మృతుడు గత మూడు నెలలుగా ఓబులాపురంలోనే ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య ఈశ్వరమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రామాంజనేయుల మృతి పట్ల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మృతుడు తిరిగి కుంట వద్దకు ఎందుకు వెళ్లాడని, ఇతర కారణాలు ఉన్నాయా.. ప్రశ్నిస్తున్నారు.


