వీహెచ్‌పీ దక్షిణాంధ్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మృతి | - | Sakshi
Sakshi News home page

వీహెచ్‌పీ దక్షిణాంధ్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మృతి

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

కర్నూలు కల్చరల్‌: విశ్వహిందూ పరిషత్‌ దక్షిణాంధ్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయి రెడ్డి (74)అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈయన అనేక దేవాలయాల నిర్మాణాలు, నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. వీహెచ్‌పీ కార్యాలయాల నిర్మాణాల్లో సాయిరెడ్డి పాత్ర మరువలేనిది. కర్నూలు ప్రాంత కార్యాలయ నిర్మాణానికి ఆర్థిక సేకరణ చేశారు. హిందూ సమాజ సేవ, ధార్మిక పరిరక్షణలో ఆయన సేవలు చిరస్మరణీయమని వీహెచ్‌పీ, బీజేపీ నాయకులు పేర్కొన్నారు. సాయిరెడ్డి పార్థివ దేహం కర్నూలు ఏక్యాంప్‌ చాణిక్యపురి కాలనీలోని వారి స్వగృహంలో కార్యకర్తల సందర్శనార్థం సోమవారం ఉదయం 9 గంటల వరకు ఉంచబడుతుందని వీహెచ్‌పీ రాష్ట్ర మీడియా కన్వీనర్‌ మాళిగి భాను ప్రకాష్‌ తెలిపారు. పాతనగరంలోని జమ్మిచెట్టు వద్ద అన్న హరిశ్చంద్ర ఘాట్‌లో అంతిమ సంస్కారాలు జరుగుతాయని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

వెలుగోడు: అబ్దుల్లాపురం సమీపంలోని మంచినీళ్ల వాగు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. రేగడగూడూరుకు చెందిన మౌలాలి, అతని కుమారుడు హర్షద్‌ నంద్యాల నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా, గుంతకందనాలకు చెందిన అశోక్‌(22), సోమరాజు అనే ఇద్దరు స్నేహితులు వేల్పనూరులో జరిగిన ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో అబ్దుల్లాపురం మంచినీళ్ల వాగు వద్ద రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అశోక్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వెలుగోడు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కుంటలో పడి వ్యక్తి మృతి

హొళగుంద: హెబ్బటం గ్రామ శివారులోని పెద్దవంక కుంటలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు ఆలూరు మండలం మనేకుర్తి గ్రామానికి చెందిన బందిర్ల రవికుమార్‌(26). మతిస్థిమితం సరిగాలేకపోవడంతో అతను అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ తిరిగి వచ్చేవాడు. ఇదే మాదిరిగా ఈ నెల 13న కూడా ఇంటి నుంచి వెళ్లిపోయాడు.అయితే, తిరిగి రాకపోవడంతో గాలింపు చేపట్టిన కుటుంబసభ్యులకు ఆదివారం ఉదయం హెబ్బటం పెద్దవంక కుంటలో శవమై కనిపించాడు. నీళ్లు తాగేందుకు వెళ్లి కుంటలో పడి మృతి చెంది ఉంటాడని రవికుమార్‌ భార్య కుప్పగల్‌దివ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మిరామ్‌నాయక్‌ విలేకరులకు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అన్నమయ్య జిల్లా వాసి మృత్యువాత

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణ శివారులోని హైవే గార్డెన్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జై భారత్‌ ట్రావెల్స్‌ బస్సు పాండిచ్చేరి నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఆళ్లగడ్డ సమీపంలో హైవైగార్డెన్‌ సమీపంలోకి వచ్చేసరికి నెల్లూరు నుంచి హైదరబాద్‌ వెళ్తున్న లారీని క్రాస్‌ చేస్తూ ప్రమాదవశాత్తూ లారీ వెనుక భాగాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు సీట్లో ఉన్న అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలం కురువపల్లి గ్రామానికి చెందిన సుబ్రమణ్యం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

దొర్వి కోనేరులో

బాలిక మృతి

రుద్రవరం: మండల కేంద్రం రుద్రవరానికి సమీపాన దొర్వి లక్ష్మీనరసింహస్వామి కోనేరు నీటిలో మునిగిపోయి లియో అనే ఆరేళ్ల బాలిక మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు... స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన ఆనంద్‌ తన ఆరేళ్ల కుమార్తె లియోకు ఈత నేర్పేందుకు ఆదివారం దొర్వి నరసింహ స్వామి ఆలయం వద్దకు వెళ్లాడు. అక్కడ ఆ బాలికకు టైర్‌ ట్యూబ్‌ కట్టి కోనేరులో వదిలాడు. మరి కొందరు పిల్లలు కూడా అందులో ఈత కొడుతుండటంతో బాలిక తండ్రి కోనేరుకు కొద్ది దూరంలో కూర్చున్నాడు. కొద్దిసేపటికి దగ్గరికి వెళ్లి చూడగా బాలిక చనిపోయి నీటిలో తేలియాడుతూ కనిపించింది. ఈత నేర్పించేందుకు తీసుకెళ్లితే తిరిగిరానిలోకాలకు బిడ్డ వెళ్లిందని బోరున విలపించారు.

Advertisement
 
Advertisement
Advertisement