ఇది బాదుడు ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

ఇది బాదుడు ప్రభుత్వం

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి

కర్నూలు (టౌన్‌): ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలపై మోయలేని భారం వేసే ప్రభుత్వం పాలన సాగిస్తుందని వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటిల్‌ తిరుమలేశ్వర రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లో బాదుడే బాదుడు పనిగా పెట్టుకుందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆదివారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. పప్పులు, నూనెలు, కూరగాయలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు 2024 సంవత్సరం తొలి త్రైమాసికంలో పోలిస్తే ఏకంగా 100 నుంచి 200 శాతం పెరిగాయని చెప్పారు. ఇప్పుడు పెట్రోలు, డీజీల్‌ ధరలు ఇతర రాష్ట్రాల్లో కన్నా మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నాయన్నారు. రోడ్డు సెస్సు, వ్యాట్‌ పేరుతో బాబు సర్కారు ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. తమ ప్రభుత్వంలో ట్యాక్సులు ఎక్కువగా ఉన్నాయని గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు, నారాలోకేష్‌లు ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేయకముందే ప్రభుత్వం స్పందించి పెట్రోలు, డీజీల్‌పై ఉన్న అదనపు ట్యాక్స్‌లను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement