కర్నూలు(సెంట్రల్): ఐదో తరగతి చదివిన విద్యార్థులందరినీ ఆరో తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శుక్రవారం పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్ల అంశంపై కలెక్టర్ విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ.. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 2,81,000 మంది విద్యార్థులను బడిలో చేర్పించే లక్ష్యం ఇచ్చారన్నారు. అందులో ఇప్పటి వరకు 2,36,000 మందిని చేర్పించారని, మిగిలిన 45 వేల మందిని చేర్పించడంలో సమస్య వస్తోందన్నారు. ఇందులో ఎక్కువగా 5వ తరగతి నుంచి 6వ తరగతి వెళ్లే వారిలో కేవలం 56 శాతం మాత్రమే అంటే 17,595 మందిని మాత్రమే బడిలో చేరుతున్నారని, మిగిలిన 13,510 మందిని చేర్పించలేక పోతున్నారన్నారు. ఇందుకోసం ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అడ్మిషన్లపై దృష్టి సారించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈఓ సుధాకర్ పాల్గొన్నారు.
జాతీయ రహదారిపై
మట్టి లారీ బోల్తా
పాణ్యం: వికారాబాద్ నుంచి కడపకు మట్టిలోడ్‌తో వెళ్తున్న లారీ తమ్మరాజుపల్లె గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో బోల్తా పడింది. ఈ ఘటనలో కడపకు చెందిన లారీ డ్రైవర్ రవికుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతి వేగంగా వస్తూ అదుపు తప్పి హైవేలోని డివైడర్ మధ్యలో ఉన్న విద్యత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైవే రోడ్డుపై మట్టి పడడంతో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. హైవే పోలీసులు జేసీబీల సహాయంతో మట్టిని తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
ఆదోని అర్బన్: ఆదోని నుంచి ఇస్వీకి వెళ్లే మార్గంలో మాసా మసీదు వెనుక భాగంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు వన్‌టౌన్ సీఐ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. మృతుని వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చన్నారు. ఎత్తు 5.6 ఉంటుందని, శరీరంపై తెల్లటి బనియన్, తెల్లటి ప్యాంటు ఉందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. గుర్తు పట్టిన వారు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలన్నారు.
వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
గడివేముల: వీధి కుక్కల దాడిలో గురువారం బూజనూరు గ్రామానికి చెందిన ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన ఓబులమ్మ, శివయ్య కుమారుడు బండి సంజయ్ ఆడుకునేందుకు వెళ్తుండగా ఒక్కసారిగా వీధి కుక్కలు కింద పడేసి తీవ్ర గాయాలు పాలు చేశాయి. దీంతో చుట్టుపక్కల ఉన్నవారు కుక్కలను కొట్టడంతో బాలుడిని వదిలేసి వెళ్లిపోయాయి. తీవ్ర గాయాల పాలైన బాలుని ఆటో ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో కుట్లు వేసి చికిత్స పొందుతున్నాడు. గ్రామాల్లో కుక్కలు ఎక్కువగా ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు తెలిపారు.


