● ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి డీహెచ్‌పీఎస్ నేతల ఫిర్యాదు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్‌కు చెందిన ఆరు ఎకరాల భూమి కబ్జాకు గురైందని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్ర, సీ మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కే తులసీదేవిని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలోని 341, 337 సర్వే నెంబర్లలోని 9.31 ఎకరాలను ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసిందన్నారు. గ్రామంలోని 30 మంది దళితులకు కోళ్ల ఫారాలు, షెడ్లు కూడా ఏర్పాటు చేసిందన్నారు. అయితే ఈ భూమిలో ఆరు ఎకరాల భూమి కబ్జాకు గురైందని, రీ సర్వేలో కూడా కబ్జాదారులకే కొమ్ము కాశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన రికార్డులను డోన్ తహసీల్దారు, ఆర్‌డీఓకు అందించినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదన్నారు. తక్షణమే ఈ భూమిని మరోసారి రీ సర్వే చేయించి అప్పట్లో కోళ్ల ఫారాలు కేటాయించిన లబ్ధిదారులకు లేదంటే ఎస్సీ కార్పొరేషన్‌కై నా అప్పగించాలన్నారు. లేని పక్షంలో డీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈడీని కలిసిన వారిలో జిల్లా నాయకులు మాణిక్యం, నాగరాజు, సులోచనమ్మ, ప్రసాద్, మల్లికార్జున తదితరులు ఉన్నారు.


