కర్నూలు (టౌన్): జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేస్తున్న పలువురికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కాయి. వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కె. గోవర్ధన్ (ఆలూరు), ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా హగనూరు పాండు (ఆలూరు) నియమితులయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులుగా పీ. జీ. నరసింహులు యాదవ్ (కర్నూలు), ఆదోని మున్సిపల్ పార్టీ నిర్వాహక సభ్యులుగా ఎస్. మహబూబ్ బాషా (ఆదోని), ఆదోని మున్సిపాల్టీ పార్టీ విభాగం అధ్యక్షులుగా బోయ చిన్న లారెప్ప (ఆదోని) లను పార్టీ నియమించింది. శుక్రవారం ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
కొత్తపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. కొత్తపల్లిలో 42.7, బనగానపల్లిలో 42.6, బండిఆత్మకూరులో 42.3, ఆళ్లగడ్డలో 42.3, చిప్పగిరిలో 42.2, సంజామలలో 42.1, నంద్యాల రూరల్‌లో 42.1, పాణ్యంలో 42.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అపర భగీరథుడు కాటన్
కర్నూలు సిటీ: కరువు నేలను అన్నపూర్ణగా మార్చిన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ అని జల వనరుల శాఖ ఇంజినీర్లు అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా శుక్రవారం కర్నూలులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జల వనరుల శాఖ శాఖ కర్నూలు సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ బాలచంద్రారెడ్డి, రిటైర్డ్ ఈఎన్‌సీ జలంధర్, రిటైర్డ్ సీఈ మురళీనాథ్ రెడ్డి, రిటైర్డ్ ఎస్‌ఈలు చెంగయ్యకుమార్, పునార్దన్ రెడ్డి, రిటైర్డ్ ఈఈ విశ్వనాథం ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గోదావరిపై ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి భరీరథుడుగా కాటన్ రైతు గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. జల వనరుల శాఖ ఏఈఈ సంధ్యరాణి, ఇంజినీర్లు పాల్గొన్నారు.
త్వరితగతిన భూ సేకరణ
తుగ్గలి: జియో మైసూర్ సర్వీసెస్(ఇండియా)గోల్డ్ మైనింగ్ ప్రవేటు లిమిటెడ్ కంపెనీ కోసం భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆర్డీవో ఓబులేసు సూచించారు. తుగ్గతి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవి, మైనింగ్ ప్రతినిధి బాలాజీతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. మైనింగ్ పరిధిలోని ప్రభుత్వ, డి పట్టా భూముల కొనుగోలుకు సంబంధించి పరిహారంపై రైతులతో మాట్లాడాలన్నారు. భూసేకరణ వేగవంతం చేయాలని సూచించారు.
కర్నూలు (అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచే యూరియా క్రయవిక్రయాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు నిఘా ఉంచాలని వ్యవసాయ శాఖ కమిషనర్ మనజీర్ జిలానీ ఆదేశించారు. ఈనెల 14న ‘సాక్షి’లో ‘లెక్కల్లో యూరియా.. దుకాణాల్లో మాయ’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్ స్పందించింది. కర్నూలు, నంద్యాల జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారుల నుంచి యూరియాకు సంబంధించి వాస్తవ పరిస్థితి తెప్పించుకుంది. ఖరీఫ్ ఆరంభం నుంచి యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం సమీక్షించాలని కమిషనర్ సూచించారు. ప్రస్తుతానికి యూరియాకు ఎలాంటి సమస్య లేదని, డిమాండ్‌కు తగ్గ నిలువలు ఉన్నాయని పేర్కొన్నారు.
సబ్సిడీ విత్తన ధరలు ఖరారు
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్‌కు సబ్సిడీపై పంపిణీ చేసే విత్తనాల ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. వేరుశనగ కిలో ఽపూర్తి ధర రూ.102 నిర్ణయించగా సబ్సిడీ 40 శాతం ఉంటుంది. సబ్సిడీ పోగా రైతులకు కిలోకు రూ.61.20 చెల్లించాల్సి ఉంది. కర్నూలు జిల్లాకు వేరుశనగ 10,723 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 2,136 క్వింటాళ్లు కేటాయించింది. పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. దయంచ కిలో ఽపూర్తి ధర రూ.160 ఉండగా... సబ్సిడీ రూ.80 ఉంటుంది. సన్‌హెంప్ కిలో పూర్తి ధర రూ.154 ఉండగా... సబ్సిడీ రూ.77 ఉంటుంది. పిల్లి పెసర కిలో పూర్తి ధర రూ.196 ఉండగా.. సబ్సిడీ రూ.98 ఉంటుంది.


