అను‘మతిలేకుండా’.. | - | Sakshi
Sakshi News home page

అను‘మతిలేకుండా’..

May 16 2026 12:45 AM | Updated on May 16 2026 12:45 AM

కర్నూలు(సెంట్రల్‌): ఇళ్లులేని పేదలు సెంటు స్థలం ఇవ్వమని కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు కనికరించరు. అయితే అధికార పార్టీ(టీడీపీ) జిల్లా కార్యాలయానికి స్థలాన్ని కేటాయించమని అడిగితే మాత్రం హూ జిహూర్‌ అంటున్నారు. క్షణాల మీద కర్నూలు నగరంలోని నడిబొడ్డున సీక్యాంపులో 1.5 ఎకరాలను కేటాయించడానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చేశారు. భూ కేటాయింపుపై ప్రభుత్వం తుది నిర్ణయాన్ని వెల్లడించక ముందే టీడీపీ నాయకులు కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

అనుమతులు రాకుండానే భూమి పూజ

కల్లూరు మండలం కల్లూరు గ్రామ రెవెన్యూ సర్వే నంబర్‌743/ఏ1లో టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమి అడిగిన నేపథ్యంలో 1.5 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం(మే15)వ తేదీన జీఓ ఎంఎస్‌ నంబర్‌ 285ను విడుదల చేసింది. అయితే ప్రభుత్వం నుంచి తుది ఆదేశాలు రాక మునుపే టీడీపీ నాయకులు ముందుగా అనుకున్న ప్రదేశంలో మే 5వ తేదీనే కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా భూమిపూజ చేశారంటే అది ఆక్రమణ కిందకు వస్తుందని, అప్పుడు అధికారులు ఏమి చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

విమర్శలు.. ఆరోపణలు

అన్నీ అనుమతులు వచ్చాక అందులో సంబంధిత వ్యక్తులు లేదా సంస్థలు లీజు నిబంధనల మేరకు ఏమైనా చేసుకోవచ్చు. అయితే టీడీపీ నాయకులు అధికారం తమదేనని, తమను ఎవరూ ప్రశ్నిస్తారన్న అహంకారంతో అనుమతులు లేకున్నా పది రోజలు ముందుగానే కార్యాలయ నిర్మాణానికి భూమి చేశారు. ప్రభుత్వ భూమిని అనధికారికంగా ఆక్రమించుకున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. పదవులు లేకున్నా అధికారిక కార్యక్రమాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులను అధికారులు ఆహ్వానించడంపై ఆరోపణలు వస్తున్నాయి.

66 ఏళ్లకు లీజు!

టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి కల్లూరు సర్వే నంబర్‌లోని 743/ఏ1లో 1.5 ఎకరాలను లీజు ప్రతిపాదికన కేటాయించారు. అయితే ఇందులో కొన్ని విస్తుపోయే నిజాలు ఉన్నాయి. కేవలం ఏడాదికి ఎకరానికి రూ.1000 మాత్రమే లీజు కింద చెల్లిస్తారు. అలా 66 ఏళ్లపాటు లీజు ఉంటుంది. తరువాత దానిని మరో 66 పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో టీడీపీ జిల్లా కార్యాలయానికి కేటాయించిన 1.5 ఎకరాలకు ఏడాదికి రూ.1500, అలాగే 66 ఏళ్లకు కేవలం రూ. 99 వేలు మాత్రమే లీజు కింద చెల్లిస్తారు. లీజు కేటాయింపులపై ప్రజలు టీడీపీ జాక్‌పాట్‌ కొట్టిందని, ప్రభుత్వ ధనాన్ని అధికార పార్టీ కోసం దుర్వినియోగం చేయడం అన్యాయమని ప్రజలు పేర్కొంటున్నారు.

మే 5న టీడీపీ జిల్లా కార్యాలయానికి

భూమి పూజ

స్థలం కేటాయింపుపై

మే 15న జీఓ విడుదల

1.5 ఎకరాల స్థలం 66 ఏళ్లపాటు లీజు

అధికారులు చర్యలు

తీసుకోకపోవడంపై ప్రజల ఆగ్రహం

Advertisement
 
Advertisement
Advertisement