పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలి

May 16 2026 12:45 AM | Updated on May 16 2026 12:45 AM

కలెక్టరేట్‌ ఎదుట సీపీఎం

ఆధ్వర్యంలో ధర్నా

కర్నూలు(సెంట్రల్‌): పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత బీజేపీ దేశ ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. ఎన్నికల సమయంలో దేశం వెలిగిపోతుందని చెప్పి ముగియగానే పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచడం అన్యాయమన్నారు. ఇది దేశ ప్రజలను మోసం చేయడం అవుతుందన్నారు. మోదీ అధికారంలోకి రాక మునుపు లీటర్‌ పెట్రోల్‌ కేవలం 55, డీజిల్‌ రూ.45 ఉండేదన్నారు. ఇప్పుడు ఆ ధరలు రెట్టింపయ్యాయన్నారు. ఇటీవల గ్యాస్‌ ధరలను కూడా భారీగా పెంచారని పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. సీపీఎం నాయకులు ఎం.రాజశేఖర్‌, విజయ్‌, షరీఫ్‌, సుధాకరప్ప, అబ్దుల్‌దేశాయ్‌, రామకృష్ణ, ప్రభాకర్‌, నరసింహులు, ఏసు పాల్గొన్నారు.

నేడు జిల్లా వ్యాప్తంగా

సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని కోరుతూ శనివారం సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆటో చార్జీలు పెరిగి ప్రజలకు ఇబ్బంది అవుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement