● న్యాయ విజ్ఞాన సదస్సులో
లీలా వెంకటశేషాద్రి
కర్నూలు: పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి హెచ్చరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్ధి సూచనల మేరకు కల్లూరు ముజఫర్ నగర్ సచివాలయంలో పోక్సో యాక్ట్‌పై శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జాగృతి పథకం 2025 కింద సురక్షిత బచ్చన్ – సురక్షిత భవిష్యపై అవగాహన కల్పించారు. అక్కడున్న పిల్లలకు పొక్సో చట్టంపై అవగాహన కల్పించారు. 18 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడకుండా పోక్సో చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. పోక్సో కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక కోర్టు ఉందని తెలిపారు. పిల్లలకు ఏదైనా సమస్య వస్తే లీగల్ సర్వీసెస్ టోల్‌ఫ్రీ నంబర్ 15100కు కాల్ చేస్తే వారి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కిశోర వికాసం కింద బాల్య వివాహాలతో జరిగే నష్టాల గురించి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద వివరించారు. చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098, మహిళా హెల్ప్‌లైన్ నంబర్ 181, పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 112 గురించి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు వివరించి కర్నూలు సీడీపీఓ అనురాధ అవగాహన కల్పించారు. అనంతరం బాల్య వివాహాల వ్యతిరేక ప్రతిజ్ఞను పిల్లలతో చేయించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.


