● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి
కర్నూలు(సెంట్రల్): వ్యాపారుల నుంచి సక్రమంగా జీఎస్టీ వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వాణిజ్య పన్నుల శాఖల అధికారులతో జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ మార్గాలను మెరుగుపరచేందుకు వసూళ్లలో పారదర్శకతను పాటించాలన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను జీఎస్టీ ఆదాయానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. రికవరీ చేసే సమయంలో ఆర్‌ఆర్ యాక్ట్ కింద వేలం వేసేటప్పుడు తగిన సహాయ సహకారాలు అందించాలని పోలీసు శాఖకు సూచించారు. నిషేధిత ఆస్తుల జాబితాను జీఎస్టీ వారి నుంచి సేకరించి వాటిని రిజిస్ట్రేషన్‌లు చేయకుండా అడ్డుకోవాలని రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించారు. కాంట్రాక్టర్లు సక్రమంగా పన్ను చెల్లింపులు చేస్తున్నారా లేదా అనే డేటాను సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ నీరజ, డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్, పరిశ్రమల శాఖ జీఎం అశోక్‌కుమార్, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి, డీఎస్‌ఓ రాజా రఘువీర్, ఎల్‌డీఎం మెహన్, సమగ్ర శిక్ష ఏపీఓ లోకరాజు పాల్గొన్నారు.


