మంత్రాలయం: గురు రాయర సన్నిధిలో గురువారం భక్తుల సందడి నెలకొంది. రాఘవేంద్రస్వామి ప్రత్యేక దినం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సేవలో తరించారు. భక్తుల రాకతో శ్రీమఠంలో రద్దీ కనపించింది. మూల బృందావన దర్శనానికి రెండు నుంచి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. సేవాభక్తుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఆరో నంబర్ గేట్ దగ్గర బ్రిడ్జ్ పై నుంచి సేవా కౌంటర్లులో దిగడానికి శ్రీమఠం అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రధాన ప్రాంగణంలో భక్తులకు ఇబ్బంది లేకుండా చేశారు. కల్పతరు దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లు భక్తులతో కిటకిటలాడాయి. తుంగ భద్ర నదీ తీరంలో భక్తుల కోలాహలం నెలకొంది. వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రాక విపరీతంగా పెరిగిపోయింది.
ఎట్టకేలకు పదోన్నతి వీఆర్‌ఓలకు స్థానాలు
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1గా పదోన్నతి పొందిన వీఆర్వోలు స్థానాల కోసం రెండు నెలలుగా నిరీక్షించారు. అదిగో ఇదిగో అంటూ కాలం గడపటంపై వీఆర్వోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వారికి గురువారం స్థానాలను కేటాయిస్తూ డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ ఉత్తర్వులిచ్చారు. మొత్తం 83 మందికి పదోన్నతి లభించిన విషయం విదితమే. కాగా ప్రస్తుతం గ్రేడ్–2 వీఆర్వోలుగా పనిచేస్తున్న 25 మందికి డిప్యూటేషన్ అవకాశం కల్పించారు. వీరు ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి మరో స్థానానికి వెళ్లేలా డీఆర్వో ఉత్తర్వులిచ్చారు.
భానుడి భగభగ
● సంజామలలో 43.3 డిగ్రీల
ఉష్ణోగ్రత నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): ఎండల తీవ్రత, ఉక్కపోత సమస్యలు పెరుగుతున్నాయి. వడగాడ్పుల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతువున్నాయి. గురువారం సంజామలలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత. చిప్పగిరిలో 42.9, కౌతాళంలో 42.9, దొర్నిపాడులో 42.6, అవుకులో 42.4, బేతంచెర్ల, చాగలమర్రి, కొత్తపల్లి, పాణ్యం, పగిడ్యాల, నంద్యాల రూరల్, గోస్పాడు, జూపాడుబంగ్లాల్లో 42.1, ఆళ్లగడ్డలో 42, గూడూరులో 41.8, కల్లూరులో 41.8, బనగానపల్లిలో 41.8, గూడూరులో 41.6, మంత్రాలయంలో 41.5 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో కూడా ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు.
నంద్యాల డీసీఓపై అభియోగాల నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని కల్లుదేవకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై అప్పట్లో జిల్లా సహకార అధికారిగా పనిచేసిన ఎన్.రామాంజినేయులు సరిగ్గా స్పందించలేదనే కారణంపై ప్రభుత్వం ఆయనపై అభియోగాలను నమోదు చేసింది. ఈయన ప్రస్తుతం నంద్యాల జిల్లా సహకార అధికారిగా పనిచేస్తున్నారు. కల్లుదేవకుంట పీఏసీఎస్ సీఈఓ వెంకటేశ్వర్లు సొసైటీ నిధులు రూ.21,18,883 దుర్వినియోగం చేసిన వ్యవహారంపై డీసీఓను విచారణ అధికారిగా నియమించగా ఆయనతో కుమ్మకై ్క విచారణను నీరుగార్చినట్లు అభియోగాలు నమోదయ్యాయి. అదే విధంగా రైతులకు పంపిణీ చేసిన రుణాలకు సంబంధించి రికవరీ చేసిన రూ.2 కోట్ల నిధులు సొసైటీకి జమ కాలేదని, ఇందుకు బాధ్యులు సొసైటీ సీఈఓనే కారణమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రాఘవరెడ్డి అనే వ్యక్తి లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా డీసీఓను విచారణ చేయాలని ఆదేశించారు. అయితే అక్రమార్కులతో డీసీఓ కుమ్మకై ్క విచారణను పక్కదోవ పట్టించినట్లు పలువురి విచారణలో వెల్లడైనట్లు అభియోగాలు నమోదయ్యాయి. వీటితో పాటు మరో రెండు అభియోగాలు కూడా నమోదు చేస్తూ సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ జీఓ ఆర్‌టీ నెంబర్ 367 జారీ చేశారు.


