సమాజాభివృద్ధికి కార్పొరేట్‌ సంస్థలు దోహదపడాలి | - | Sakshi
Sakshi News home page

సమాజాభివృద్ధికి కార్పొరేట్‌ సంస్థలు దోహదపడాలి

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

నంద్యాల(అర్బన్‌): ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సోషల్‌ వెల్ఫేర్‌ కళాశాల బాలుర హాస్టల్‌ –1, 2లకు నూతనంగా నిర్మించిన మరుగుదొడ్ల కాంప్లెక్స్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాసంస్థల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం అత్యంత అవసరమన్నారు. ది రామ్‌కో సిమెంట్స్‌ లిమిటెడ్‌ కొలిమిగుండ్ల యూనిట్‌ తమ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమంలో భాగంగా రూ.14.53 లక్షల వ్యయంతో ఈ మరుగుదొడ్ల సముదాయాన్ని నిర్మించినట్లు తెలిపారు. సమాజాభివృద్ధికి దోహదపడే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలన్నారు. కార్యక్రమంలో రామ్‌కో సిమెంట్స్‌ కొలిమిగుండ్ల యూనిట్‌ హెడ్‌ మీనాక్షి సుందరం, జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి చింతామణి తదితరులు పాల్గొన్నారు.

పాముకాటుతో బాలుడి మృతి

బేతంచెర్ల: రహిమానుపురం గ్రామానికి చెందిన బాలుడు పాముకాటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాగరాజు ఈనెల 9వ తేదీ సాయంత్రం మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు కుమారుడు నవీన్‌ (16)ను వెంట తీసుకెళ్లాడు. నీరు కట్టేందుకు పొలంలో వెళ్తుండగా నవీన్‌ చూడకుండా పామును తొక్కడంతో కాలుపై కాటు వేసింది. వెంటనే బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. కాగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11 గంటల సమయంలో మరణించాడు. తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం

డోన్‌ టౌన్‌: పట్టణంలోని సుందర్‌సింగ్‌ కాలనీలో నివాసం ఉండే కమ్మర గీతారాణి ఇంటిలో గురువారం తెల్లవారు జామున షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్రిజ్‌ వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు వ్యాపించాయి. ఇంట్లో నిద్రిస్తున్న గీతారాణి అప్రమత్తమై బయటకు వచ్చింది. స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది రంగస్వామి, మహేశ్వరరెడ్డి, చంద్రమోహన్‌ చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఇంట్లో సామగ్రి, నిత్యావసర సరుకులు, రూ. 50 వేల నగదు దగ్ధమైనట్లు బాధితురాలు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 2.20 లక్షల ఆస్తినష్టం వాటిలి నట్లు అగ్నిమాపక అధికారి రంగస్వామిగౌడ్‌ తెలిపారు. ఉన్నారు.

వ్యక్తి ఆత్మహత్య

బేతంచెర్ల: పట్టణంలోని అల్లా బకాష్‌ దర్గా కాలనీలో నివాసం ఉంటున్న కుమ్మరి సురేష్‌(46) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాదాపు రూ. 10 లక్షల దాకా అప్పులు చేయడంతో రోజు అప్పుదారులు ఇంటికొచ్చి పోతుండటంతో చెప్పుకోలేక జీవితంపై విరక్తి చెందాడు. ఈ క్రమంలోఈనెల 9న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం 108లో కర్నూలుకు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి సురేష్‌ మృతి చెందాడు. మృతుడి భార్య నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ చెన్నయ్య తెలిపారు.

మద్దిలేటయ్య హుండీ ఆదాయం రూ.48.75 లక్షలు

బేతంచెర్ల: ఆర్‌ఎస్‌ రంగాపురం శివార్లలో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ.48,75,058 వచ్చింది. స్వామి, అమ్మ వార్లకు భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలు, ముడుపులు, నిత్యన్నదాన సత్రం హుండీ లెక్కింపు గురువారం చేపట్టారు. దేవదాయశాఖ అధికారి రమేష్‌ పర్యవేక్షణలో 44 రోజులకు సంబంధించిన హుండీ లెక్కింపు నిర్వహించగా రూ.48,75,058 నగదు, 21 గ్రాముల బంగారు, 1.210 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ ఉప కమిషనర్‌ రామాంజనేయులు వెల్లడించారు. కార్యక్రమంలో బాలజీ సేవా ట్రస్ట్‌ సభ్యులు, డోన్‌, బేతంచెర్ల మద్దిలేటి సేవా సమితి, వాసవీ సభ్యులు పాల్గొన్నారు.

పండితులు

వెంకటాచలపతి మృతి

కర్నూలు కల్చరల్‌: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రముఖ పండితులు, అపరబ్రహ్మ, స్మార్త పురోహితులు గూడా వెంకటాచలపతి (72) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం మరణించారు. ఆయన మృతికి పలువురులు నగర ప్రముఖులు, బ్రాహ్మణ సంఘం నాయకులు సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement