కర్నూలు(సెంట్రల్): ‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారంలో ఇంత నిర్లక్ష్యమా? కర్నూలు జిల్లా బాగా వెనుకబడి ఉంది.. ఒక్క శాతం కంటే కూడా తక్కువగా పరిష్కార రేటు నమోదై ఉంది.’ అని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా, నియోజకవర్గ, మండల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కర్నూలు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు113 నమోదు కాగా ఇప్పటి వరకు వాటిలో కేవలం 11 కేసులకు సంబంధించి మాత్రమే యాక్షన్ టేకేన్ రిపోర్టు వచ్చిందన్నారు. మిగిలిన 102 కేసులకు ఇంకా రాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో దళితులు స్వేచ్ఛగా బతికేలా పోలీసులు భరోసా కల్పించాల్సి ఉందన్నారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు తప్పుడు కేసులుగా చిత్రీకరించకుండా, సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు కచ్చితంగా ఎస్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. విధుల్లో వైఫల్యం చెందిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ తరపున సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. అనంతరం శాఖల వారీగా ఆయనసమీక్షించారు.
ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసులకు సంబంధించి యాక్షన్ టేకెన్ రిపోర్టు 15 రోజుల్లోగా సమర్పిస్తామని చైర్మన్‌కు వివరణ ఇచ్చారు. భూ సమస్యలు, అసైన్‌మెంట భూ ముల పంపిణీ, పెన్షన్‌లు, హౌస్ సైట్ పట్టాల అంశాలపై ప్రత్యేకంగా సమీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే సగం కేసుల్లో ఉద్యోగాలు, భూములు ఇచ్చామని, ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని, బాధితులకు అందించాల్సిన పింఛన్ల కోసం 40 నుంచి రూ.50 లక్షల వరకు అవసరమని చైర్మన్ దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లారు.
60 రోజుల్లో విచారణ పూర్తి
జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్ మాట్లాడుతూ..పోలీసు శాఖ తరపు నుంచి తాము రిజిస్టర్ చేస్తున్న కేసుల్లో 60 రోజుల్లో విచారణను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్న రాముడు, అదనపు ఎస్పీ హుస్సేన్‌పీరా, డీఆర్వో సి.వెంకటన నారాయణమ్మ, జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి తులసిదేశి, కర్నూలు ఇన్‌చార్జి ఆర్‌డీఓ అనురాధ, పత్తికొండ ఇన్‌చార్జి ఆర్‌డీఓ మధుసూధన్‌రెడ్డి, కర్నూలుమునిసిపల్ కమిషన్ ఓబులేషు, ఎస్సీ కమిషన్ సభ్యులు బిక్షం మేకల, పాకనాటి గౌతమ్ రాజ్, రామాంజినమ్మ పాల్గొన్నారు. పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు వివిధ సమస్యలపై వినతులు అందజేశారు.
కర్నూలు జిల్లా బాగా
వెనుకబడి ఉంది
కేసుల్లో ఒక్కశాతం కంటే
తక్కువ పరిష్కారమా?
102 కేసులు పెండింగ్‌లో
ఉండడంపై అసంతృప్తి
దళితుల నుంచి ఫిర్యాదులను
స్వీకరించిన ఎస్సీ కమిషన్
కేఎస్ జవహర్


