పేగులు బయటపడినా బతికించారు! | - | Sakshi
Sakshi News home page

పేగులు బయటపడినా బతికించారు!

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

విజయవంతంగా ఆపరేషన్‌ చేసిన

పెద్దాసుపత్రి వైద్యులు

కర్నూలు(హాస్పిటల్‌): అతను రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పొట్టలోని పేగులను చేతులతో పట్టుకుని ప్రాణాలు కాపాడాలని పలు ప్రైవేటు ఆసుపత్రులు తిరిగాడు. అతని పరిస్థితి చూసి ఏ ఆసుపత్రీ చేర్చుకుని వైద్యం అందించే సాహసం చేయలేదు. ఈ పరిస్థితిలో మేమున్నామంటూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అక్కున చేర్చుకుని మెరుగైన వైద్యం అందించి ప్రాణం పోసింది. వివరాలను జనరల్‌ సర్జరీ యూనిట్‌–5 ఛీఫ్‌ డాక్టర్‌ మాధవీశ్యామల పేర్కొన్నారు. నంద్యాల జిల్లాకు చెందిన తౌఫిక్‌(17) అనే యువకుడు గత యేడాది ఆగష్టు 30వ తేదిన జరిగిన జేసీబీ, బైక్‌ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో అతని చిన్న, పెద్ద పేగులు పూర్తిగా దెబ్బతిని బయటకు వచ్చాయి. పరిస్థితి విషమించి ఉండటంతో అనేక ప్రైవేటు ఆసుపత్రులు తిరిగినా ఎవ్వరూ చేర్చుకోలేదు. ఆఖరి ప్రయత్నంగా కుటుంబసభ్యులు అతన్ని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకురాగా వైద్యులు అతనికి అత్యవసర ఆపరేషన్‌ చేసి ప్రాణం పోశారు. దాదాపు ఏడు గంటల పాటు ఐదుగురు వైద్యులు శ్రమించి అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్‌ను నిర్వహించి దెబ్బతిన్న ప్రేగులకు చికిత్స అందించారు.

పూర్తి ఆరోగ్యంగా తౌఫిక్‌

ప్రమాదం వల్ల కోల్పోయిన కండర శక్తిని తిరిగి పొందేందుకు రోగికి దాదాపు 8 నుంచి 9 నెలల సమయం పట్టింది. మధ్యలో ఏర్పడిన ఎంటెరోక్యూటేనియస్‌ ఫిస్టులా సమస్యకు కూడా విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం తౌఫిక్‌ పూర్తి ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. వైద్యబృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు గురువారం అభినందించారు. కార్పొరేట్‌ ఆసుపత్రులు సైతం చికిత్స అందించలేమని వెనకడుగు వేసిన తరుణంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం అందించి రోగిని కాపాడటం గర్వకారణమని ఆయన కొనియాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వసతులు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారనడానికి ఈ విజయమే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్‌ చేసిన వారిలో యూనిట్‌–5 చీఫ్‌ డాక్టర్‌ మాధవీశ్యామల, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ డివి.చంద్రరెడ్డి, డాక్టర్‌ ఎస్‌.శృతి, పీజీలు డాక్టర్‌ సాయికుమార్‌, డాక్టర్‌ దేవిక, డాక్టర్‌ షమీర్‌, అనెస్తీషియా విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ రామశివనాయక్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement