క్షణ.. క్షణం ఉత్కంఠ | - | Sakshi
Sakshi News home page

క్షణ.. క్షణం ఉత్కంఠ

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

కోతులబావి దేవాలయం దగ్గర

మోహరించిన పోలీసులు

ఎమ్మిగనూరురూరల్‌: పట్టణంలోని కోతులబావి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ఉన్న బండలను తొలగిస్తామని శ్రీహనుమాన్‌ కరసేవకులు పిలుపునివ్వటంతో భారీ పోలీసు బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. ఏ క్షణం ఏమి జరుగుతుందోనని ఉత్కంఠ భరితంగా మారింది. కోతులబావి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం స్థలం చుట్టూ కంచెను హిందూ సంఘాలు ఏర్పాటు చేశాయి. కొన్ని నెలల క్రితం దేవాలయం చుట్టూ ఉన్న కంచెను మున్సిపల్‌ కమిషనర్‌ పోలీసు అధికారుల సమక్షంలో జేసీబీలతో తొలగించి, దేవాలయం చుట్టు వివాదాస్పద స్థలంలో నాపరాళ్లను పాతించారు. అప్పటి నుంచి హిందూ సంఘాలు, మున్సిపల్‌ అధికారుల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. శ్రీ హనుమాన్‌ కరసేవకులతో దేవాలయం చుట్టూ ఉన్న బండలను తొలగిస్తామని, హిందూవుల తరలిరావాలని మాజీ కౌన్సిలర్‌ కోనేరు నాగేంద్రప్రసాద్‌, కరసేవ కార్యకర్త ఉపేంద్రరెడ్ది సోషల్‌ మీడియాలో పోస్టులను ఉంచి పిలుపునిచ్చారు. దీంతో పోలీస్‌, రెవిన్యూ, మున్సిపల్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. కరసేవకులు తరలిరావాలని సోషయల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన మాజీ కౌన్సిలర్‌ కోనేరు నాగేంద్రప్రసాద్‌ను బైండోవర్‌ చేశారు. మళ్లీ పోస్టులు ఉంచడంతో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. మరో కరసేవ కార్యకర్త ఉపేంద్రరెడ్డి, మరి కొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా వారు సెల్‌ ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌ చేసుకున్నారు. ఎటువైపు నుంచి కరసేవకులు వస్తారో, ఏమి జరుగుతుందోనని ఒక డీఎస్పీ, పది మంది సీఐలు, 13 మంది ఎస్‌ఐలు, పోలీసులు, స్పెషల్‌ పార్టీ పోలీసులతో కలపి మొత్తం 160 మందితో బందోబస్త్‌ నిర్వహించారు. దేవాలయం దగ్గర పరిస్థితిపై డీఎస్పీ ముర్రవాడ భార్గవి, టౌన్‌ సీఐ కంబగిరిరాముడు, తహసీల్దార్‌ శ్రీనివాసుల ఆరా తీశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement