దొంగను హత్యచేసిన యాచకుడు | - | Sakshi
Sakshi News home page

దొంగను హత్యచేసిన యాచకుడు

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

మద్యం మత్తులో ఇరువురి మధ్య గొడవే కారణం

కర్నూలు: కోడుమూరు పట్టణానికి చెందిన పాత నేరస్థుడు, మోటర్‌ సైకిళ్ల దొంగ అబ్దుల్‌ కలాం అలియాస్‌ మచ్చా(24) దారుణ హత్యకు గురయ్యాడు. అబ్దుల్‌ కలాం బళ్లారి చౌరస్తా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి కింద పాత కల్లూరుకు చెందిన రెడ్డిపోగు చిన్నప్రసాద్‌ అతిగా మద్యం తాగి ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ క్రమంలో అబ్దుల్‌ కలాం ముఖంపై, గొంతుపై బీరు సీసాతో పొడిచి హత్య చేశాడు. రెడ్డిపోగు చిన్నప్రసాద్‌ దివ్యాంగుడు. ఈయన యాచక వృత్తి చేస్తూ రాత్రివేళల్లో బళ్లారిచౌరస్తా ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి కింద పడుకుంటాడు. చిన్నప్రసాద్‌తో అబ్దుల్‌ కలాంకు పాత పరిచయం ఉంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అబ్దుల్‌ కలాం బ్రిడ్జి వద్దకు చేరుకుని ప్రసాద్‌ను డబ్బులు ఇవ్వాలని కోరాడు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ దొబ్బుకున్నారు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన చిన్నప్రసాద్‌ పక్కనే ఉన్న బీరు సీసాతో ముఖం, గొంతుపైన బాదడంతో తీవ్ర రక్తస్రావమై అబ్దుల్‌ కలాం సొమ్మసిల్లి పడిపోయాడు. రాత్రి గస్తీ పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్య జరిగినట్లు నిర్ధారించారు. ఆ ప్రాంతంలో ఉన్న వారిని విచారించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించారు.

ఫోర్త్‌టౌన్‌లో సస్పెక్ట్‌ షీట్‌

కలాంపై నాల్గవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సస్పెక్ట్‌ షీట్‌ కూడా ఉంది. కృష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన రమీజాబీ కుమారుడు కలాంతో కలసి 15 ఏళ్ల క్రితం కోడుమూరుకు వలస వచ్చి కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. అబ్దుల్‌ కలాం చిన్న వయస్సులోనే జల్సాలకు అలవాటు పడి జులాయిగా తిరిగేవాడు. ఖర్చుల కోసం వాహన దొంగతనాలు, ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ పలుమార్లు జైలుకు కూడా వెళ్లాడు. బ్రిడ్జి కింద పడుకుని ఉన్న చిన్నప్రసాద్‌ను డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో మాటామాటా పెరిగి కొట్టుకునే క్రమంలో హత్యకు గురయ్యాడు. తల్లి రమీజాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి హత్యకు సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విక్రమసింహ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement