గ్యాస్‌ ఏజెన్సీలో అధికారుల తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ ఏజెన్సీలో అధికారుల తనిఖీలు

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

బనగానపల్లె: గ్యాస్‌ సిలిండర్ల సరఫరాలో ఏజెన్సీ డీలర్‌ నిర్లక్ష్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనగానపల్లెలోని బాలాజీ గ్యాస్‌ ఏజెన్సీ డీలర్‌ సిలిండర్ల డెలివరీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ‘గ్యాస్‌ సిలిండర్ల కోసం పడిగాపులు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బాలాజీ గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయాన్ని సివిల్‌ సప్లై అధికారి రవిబాబు, బనగానపల్లె ఆర్డీవో నరేంద్రనాథ్‌రెడ్డి, ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ నాగేశ్వరరెడ్డి తనిఖీ చేశారు. అధికారులు వచ్చారనే సమాచారం తెలుసుకున్న కొందరు వినియోగదారులు అక్కడికి చేరుకుని పలు సమస్యలను విన్నవించారు. సిలిండర్‌ బుక్‌ చేసినా 20– 30 రోజుల వరకు అందడం లేదన్నారు. సిలిండర్లను డోర్‌ డెలివరీ చేయాల్సి వుండగా పట్టణానికి మూడు కిలో దూరంగా ఉన్న గోడౌన్‌ వద్దకు వచ్చి సిలిండర్లను పొందడంలో తీవ్ర ఇబ్బందులుపడుతున్నట్లు వినియోగదారులు వాపోయారు. సుమారు 10 మంది నుంచి రాతపూర్వకంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రికార్డులను గోడౌన్‌లో స్టాక్‌ను అధికారులు పరిశీలించారు. డీఎస్‌ఓ రవిబాబు మాట్లాడుతూ డీలర్‌ వద్ద ఆన్‌లైన్‌లో 495 సిలిండర్ల స్టాక్‌ ఉండాల్సి ఉండగా 11 స్టాక్‌ మాత్రమే ఉన్నట్లు తెలిపారు. పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు, భారత్‌ గ్యాస్‌ కంపెనీకి చెందిన సేల్స్‌ అధికారికి నివేదిక అందజేయడం జరిగిందన్నారు. గ్యాస్‌ డీలర్‌పై చట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్యాస్‌ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement