ఎమ్మిగనూరుటౌన్: నేత వృత్తిని, చేనేత ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత పద్మశ్రీ మాచాని సోమప్పకే దక్కిందని, అందుకే ఆయనను చేనేత పితామహుడు అంటారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్‌రెడ్డి అన్నారు. మాచాని సోమప్ప 48వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని ఆయన విగ్రహానికి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి, చేనేత కార్మికులు, పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. చేనేతల అభ్యున్నతి కోసం పద్మశ్రీమాచాని సోమప్ప ఎనిమిది దశాబ్దాల క్రితమే పట్టణంలో ఎన్నో సంస్థలు స్థాపించి చేనేతలతో పాటు ఎన్నో కులాలకు ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. స్పిన్నింగ్ మిల్లు, వైడబ్ల్యూసీఎస్, కో ఆపరేటివ్ స్టోర్స్, లెదర్ సొసైటీ, ట్రాన్స్‌పోర్ట్ లాంటి సంస్థలను నెలకొల్పి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశ, విదేశాల్లో చేనేత ఉత్పత్తులను పరిచయం చేశారన్నారు. దీంతో నేటికీ ఎమ్మిగనూరు చేనేత ఉత్పత్తులకు మంచి గుర్తింపు వుందని తెలిపారు. ఆయన ఆశయ సాధనకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి మాచాని వెంకటేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టారంగయ్య, చేనేత విభాగం నాయకులు పార్టీ నాయకులు సత్యన్న, శ్రీనివాసులు, గోవిందప్ప, బీఆర్ బసిరెడ్డి, భీమిరెడ్డి, రియాజ్ అహమ్మద్, కోటేకల్ లక్ష్మన్న, బంగిశ్రీరాం, షబ్బీర్ అహమ్మద్, షాబుద్దీన్, వేణుగోపాల్‌రెడ్డి, నాగభూషణ్‌రెడ్డి, పిల్లిగుండ్ల గోవిందు, సోమేష్ తదితరులు పాల్గొన్నారు.


