ఐక్యతా రాగం.. చేనేతల విజయం
పటా పంచలైన కూటమి కుట్ర
ఆప్కోలో వైడబ్ల్యూసీఎస్ విలీనానికి సభ్యుల ససేమిరా
మహాజన సభలో విలీనానికి వ్యతిరేకంగా 210 మంది సంతకాలు
ఎమ్మిగనూరుటౌన్: తమ జీవనాధారమైన వైడబ్ల్యూ సీఎస్‌ను కాపాడుకునేందుకు చేనేతలు ఒక్క తాటిపై నిలిచారు. కలసికట్టుగా కూటమి కుట్రను ఛేదించారు. చేనేతలు, స్థానిక వైడబ్ల్యూసీ సభ్యులు అధికార పార్టీకి షాకిచ్చారు. కోట్లాది రూపాయల ఆస్తులతో పాటు దేశ వ్యాప్తంగా 16 వైడబ్ల్యూసీఎస్ ఔట్‌లెట్లు ఉన్న సొసైటీని నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడంతో పాటు మరో మూడు అంశాలను మహాజన సభలో ఆమోదింపజేసుకోవాలని అధికార పార్టీ నాయకులు పన్నిన కుట్ర బెడిసికొట్టింది. ఈ మేరకు మంగళవారం స్థానిక వైడబ్ల్యూసీఎస్ కార్యాలయ ఆవరణలో సొసైటీ మహాజన సభను ఆర్డీఓ అజయ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సర అంచనా బడ్జెట్‌తో పాటు హెచ్.మురవణి వద్ద సంఘ సభ్యులకు ఇచ్చిన 18.98 ఎకరాల భూమి గురించి చర్చించడం, 2024–25 ఆర్థిక సంవత్సర అడిట్ రిపోర్ట్‌తో పాటు అజెండాలోని 3వ అంశం చేనేత జౌళీశాఖ కమిషనర్ సూచనల మేరకు వైడబ్ల్యూసీఎస్ ఎంపోరియంలను ఆప్కోలో విలీనం చేసేందుకు అధికారులు సభలో ప్రతిపాదించారు. సభ్యులు ఒక్కసారిగా లేచి మూకుమ్మడిగా వ్యతిరేకించారు. తమ సొసైటీని ఆప్కోలో విలీనం చేయనీయమని, ఈ అంశాన్ని ఒప్పుకునే ప్రశ్నేలేదని మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆర్‌డీఓ, చేనేత జౌళిశాఖ ఏడీ, స్థానిక వైడబ్ల్యూసీఎస్ ఇన్‌చార్జ్ కార్యదర్శి అయిన నాగరాజారావుతో సభ్యులు వాగ్వాదానికి దిగారు. లాభాల్లో ఉన్న తమ సొసైటీని నష్టాల్లో వున్న ప్రభుత్వ రంగ సంస్థ ఆప్కోలో ఎలా విలీనం చేస్తారని ధ్వజమెత్తారు. ఈ విలీనం వెనుక కుట్ర దాగుందన్నారు. అయితే వైడబ్ల్యూసీఎస్‌ను ఆప్కోలో విలీనం చేయబోమని, ఆప్కో ఉత్పత్తులతో పాటు సొసైటీ ఉత్పత్తులను విక్రయించేందుకే ఆప్కోలో ఉంచుతామని ఏడీ వివరించే ప్రయత్నం చేసినా.. సభ్యులు ససేమిరా అన్నారు. తామంతా ఈ ప్రతిపాదనకు వ్యతిరేకమని సభ అజెండాలోని మూడవ అంశాన్ని తాము ఆమోదించమని ముక్తకంఠంతో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఏదో ఒక విధంగా సభ్యులను నచ్చజెప్పి విలీన అంశాన్ని ఆమోదింపజేయాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో మహాజన సభకు హాజరైన 225 మంది సభ్యుల్లో వైడబ్ల్యూసీఎస్‌ను ఆప్కోలో విలీనానికి వ్యతిరేకంగా 210 మంది సభ్యులు సమావేశపు అజెండా పుస్తకంలో సంతకాలు చేశారు. మిగిలిన వారు సంతకాలు చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో విలీన ప్రతిపాదనకు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు సంతకాలు చేశారని ఏడీ ప్రకటించారు. వైడబ్ల్యూసీఎస్‌ను ఆప్కోలో విలీనానికి సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీఓ అజయ్‌కుమార్, ఏడీ నాగరాజారావు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసులు బందోబస్తు చేపట్టారు.
కార్యదర్శి బదిలీ వెనుక రాజకీయం..
వైడబ్ల్యూసీస్, చేనేతల అభ్యున్నతికి పనిచేస్తూ, నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తున్న సంఘ కార్యదర్శి అప్పాజీని చేనేత జౌళీ శాఖ కమిషనర్ గత ఆదివారం రాత్రి విధులను తప్పించి రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేసినట్లు సమాచారం. ఆయన స్థానికంగా ఉంటే వైడబ్ల్యూసీస్ ఆప్కోలో విలీనంతో పాటు సంఘ ఆస్తులను కొల్లగొట్టేందుకు అవకాశం ఉండదనే నెపంతోనే కార్యదర్శి అప్పాజీని మహాజన సభకు రెండు రోజుల ముందు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఆగమేఘాల మీద ఆదేశాలిచ్చినట్లు సభ్యులు విమర్శిస్తున్నా రు. కార్యదర్శి బదిలీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏడీ సమాధానమిస్తూ.. ఆప్కోలో విలీన అంశంపై ఆయన తప్పిదం చేశారని, ఈ మేరకు కమిషనర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు.
ఎమ్మెల్యేకు చేనేతల ఝలక్..
చేనేతలపై అమితమైన ప్రేమ కురిపిస్తూ వారిని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డికి వైడబ్ల్యూసీఎస్ సభ్యులు మహాజన సభలో ఝలక్ ఇచ్చారు. అధికార పార్టీ నాయకులు వైడబ్ల్యూసీఎస్ ఆస్తులను కొల్లగొట్టేందుకే తమ సంస్థను ఆప్కోలో విలీనం చేసే కుట్ర పన్నారని చేనేతలు పసిగట్టారు. విలీనాన్ని మూకుమ్మడిగా వ్యతిరేకించడంతో చేనేతలు తమవైపే వున్నారని చెప్పుకునే టీడీపీ నాయకులకు ఒక గుణపాఠం చెప్పినట్లు అయ్యిందని సభ వద్ద చేనేతలు బాహాటంగా చర్చించుకోవడం గమనార్హం.


