లోకాయుక్త సేవలకు గవర్నర్‌ అభినందన | - | Sakshi
Sakshi News home page

లోకాయుక్త సేవలకు గవర్నర్‌ అభినందన

Mar 31 2026 7:26 AM | Updated on Mar 31 2026 7:26 AM

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్న ఏపీ లోకాయుక్త సంస్థకు గవర్నర్‌ అభినందనలు తెలిపినట్లు ఉప లోకాయుక్త జస్టిస్‌ పి.రజనీ తెలిపారు. ఇటీవల లోకాయుక్త వార్షిక నివేదికను గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌కు సమర్పించినట్లు ఆమె చెప్పారు. ఆ నివేదికలోని తమ సంస్థ పనితీరుపై గవర్నర్‌ పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. 2025 జనవరి 01 నుంచి డిసెంబర్‌ 31వ తేదీ వరకు వచ్చిన 3106 కొత్త ఫిర్యాదులతోపాటు అప్పటికే పెండెన్సీలో ఉన్న 4,325 కేసులను కలుపుకొని మొత్తం7,431 ఫిర్యాదుల్లో 3,654 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. ఈ ఫిర్యాదుల్లో అధిక శాతం రెవెన్యూ సమస్యలే ఉన్నాయన్నారు. అంతేకాక దుర్వినియోగమైన రూ.15.29 కోట్ల ప్రజాధనాన్ని ఖజానాకు జమచేసినట్లు చెప్పారు. తప్పు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో లోకాయుక్త కీలకపాత్ర పోషిస్తుందన్నారు. మోసాలకు పాల్పిన ఉద్యోగులను సర్వీసు నుంచి తొలగించడం, అనుమతి లేకుండా గైర్హాజరమైన వైద్యులు, ఉద్యోగుల నుంచి తొలగించడం, అవినీతి, అక్రమాలకు సంబంధించిన పలు అంశాలలో అధికారులు, ఉద్యోగులకు జరిమానాలను విధించడం వంటి చర్యలు తీసుకోవాలని లోకాయుక్త సిఫారుసు చేసిందని చెప్పారు. సుమోటో అధికారాలను ఉపయోగించి కేసులు నమోదు చేసుకుని కార్మికులు, కర్షకుల పిల్లల సంక్షేమ, ప్రభుత్వ ఖాజానా కార్యకలాపాల్లో పారదర్శకత పెంపు, ప్రజారోగ్యాన్ని కాపాడడంలో చర్యలు, విద్యార్థి హక్కుల పరిరక్షణ వంటి అంశాల్లో జోక్యం చేసుకొని పరిష్కారాలకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. మున్ముందు కూడా లోకాయుక్త సంస్థ ఎంతో బాధ్యతయుతమైన పాత్రపోషించడంలో కీలకంగా ఉంటుందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement