కర్నూలు(సెంట్రల్): ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎంతో వ్యయప్రయాసాలకోర్చి వస్తున్నారు. కలెక్టర్, జేసీలకు వినతులను ఇస్తే పరిష్కారం అవుతాయనే నమ్మకం ఇక్కడి వరకు వచ్చేలా చేస్తోంది. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమానికి ఉన్నతాధికారులు ఇద్దరూ హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్రత అసంతృప్తికి లోనయ్యారు. ఏడెనిమిది వా రాల నుంచి కలెక్టర్, జేసీ సరిగా అందుబాటులో ఉండటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వ కార్యక్రమాలకే అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో డీఆర్వో, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు పీజీఆర్‌ఎస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సోమవారం కూడా కలెక్టర్ స్థానికంగానే కల్లూరులో ఓ లబ్ధిదారుడి గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొనగా.. జేసీ ఎమ్మిగనూరులో టిడ్కో గృహాల ప్రవేశంలో పాల్గొనడంతో డీఆర్వో ఆధ్వర్యంలోనే పీజీఆర్‌ఎస్ కొనసాగింది. కార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ అనురాధ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నల్లమలలో లారీ బోల్తా
మహానంది: నంద్యాల–గిద్దలూరు నల్లమల ఘాట్‌రోడ్డులో కందుల లోడుతో వెళ్తున్న లారీ ఆదివారం అర్థరాత్రి బోల్తా పడింది. గిద్దలూరు నుంచి నంద్యాల వైపు వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడటంతో కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ నెలకొంది. మహానంది, శిరివెళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్దీకరించారు. లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలం గిద్దలూరు పరిధిలోకి రావడంతో గిద్దలూరు పోలీసులు వివరాలు సేకరించినట్లు తెలిసింది.


