కర్నూలు(సెంట్రల్): ఆస్పరి మండలం కై రుప్పలలో ఫేక్ డ్యాకుమెంట్లతో రెవెన్యూ అధికారులు మాయజాలం చేశారు. గ్రామానికి చెందిన విజయమోహన్ అనే వ్యక్తి భూమిని అదే గ్రామానికి చెందిన గుర్రందొడ్డి కురువ లక్ష్మి పేరిట ఆయనకు తెలియకుండానే మ్యుటేషన్ చేశారు. ఆయన తన కుమారులకు భూ మి భాగ పరిష్కారాల సమయంలో జరిగిన మోసా న్ని తెలుసుకున్నారు. న్యాయం కోసం రెండేళ్లుగా కలెక్టరేట్, పత్తికొండ ఆర్డీఓ, ఆస్పరి తహసీల్దార్ కార్యాలయాల్లో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తీవ్ర మనోవేదనలో ఉన్నారు.
ఊరులో లేని విషయాన్ని
పసిగట్టి పన్నాగం
విజయమోహన్ స్టేట్ బ్యాంకులో పనిచేసి పదవీ విరమణ తరువాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. కై రుప్పలలో సర్వే నంబర్ 70లో అతనికి 1.54 ఎకరాల భూమి ఉంది. ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.30లక్షలకు పైగా పలుకుతోంది. ఈ భూమిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని కొందరు పన్నాగం పన్నారు. గ్రామ వీఆర్వోగా పని చేసిన ఎస్టీ వీరన్న ఇందులో కీ లక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గ్రామానికి చెందిన గుర్రందొడ్డి కురువ లక్ష్మి ద్వారా కథ నడిపించి రా త్రికి రాత్రే భూమిని ఆమె పేరిట బదలాయించారు.
గుడ్డిగా మ్యుటేషన్ చేసిన తహసీల్దార్
మ్యుటేషన్ చేసే సమయంలో రెవెన్యూ అధికారులు కనీసం నిబంధనలు పాటించలేదు. ఆధారంగా సమర్పించిన డాక్యుమెంట్ ఈసీ చూడలేదు. భూ యజమానులకు నోటీసులు ఇవ్వలేదు. వీఆర్వో, ఆర్‌ఐ, త హసీల్దార్ గుడ్డిగా సంతకాలు చేశారంటే వారికి భారీ గా ముడుపులు ముట్టినట్లు తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించి రెండేళ్లుగా పత్తికొండ ఆర్‌డీఓ కార్యాలయంలో ఆర్‌ఓఆర్ కేసు కూడా పెండింగ్‌లో ఉంది.
ఎలా మోసం చేశారంటే..!
కురువ లక్ష్మి అదే గ్రామానికి చెందిన చిన్న వీర న్న వద్ద నుంచి సర్వే నంబర్ 52లో 1.33 ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ డాక్యుమెంట్‌ను సర్వే నంబర్ 70లో విజయమోహన్‌కు చెందిన 1.54 ఎకరాలను కొల్లగొట్టేందుకు వినియోగించారు. డాక్యుమెంట్‌లో సర్వే నంబర్, విస్తీర్ణం స్థానాల్లో వైట్‌నర్‌తో రుద్ది సర్వే నంబర్ 70కి సంబంధించిన సర్వే నంబర్, విస్తీర్ణాలను నమోదు చేశారు.ఆ ఫేక్ డ్యాకుమెంట్‌తో 2024 జూలై 24న ఆస్పరి తహసీల్దార్‌తో మ్యుటేషన్ చేయించారు.


