ఫుడ్‌ పాయిజన్‌ కలకలం | - | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ పాయిజన్‌ కలకలం

Mar 25 2026 7:04 AM | Updated on Mar 25 2026 7:04 AM

● వాంతులు, విరేచనాలతో 60 మంది ఆసుపత్రిలో చేరిక ● పెళ్లిలో మిగిలిన ఆహారం తినడమే కారణమంటున్న అధికారులు

నంద్యాల(అర్బన్‌): పట్టణ శివారులోని నందమూరినగర్‌ వద్ద ఉన్న బుడగ జంగాల కాలనీలో సోమవారం అర్ధరాత్రి ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. దాదాపు 60 మంది వాంతులు, విరేచనాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పెళ్లిలో మిగిలిన ఆహారాన్ని తెచ్చుకొని తినడం వల్లే ఫుడ్‌పాయిజన్‌ అయినట్లు అధికారులు చెబుతున్నారు. వివరాలు.. పట్టణ సమీపంలోని బుడగజంగాల కాలనీలో దాదాపు 210 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంతా చిరువ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం రాత్రి ఓ పెళ్లిలో మిగిలిన ఆ హారాన్ని తెచ్చుకొని పలు కుటుంబాలు తిన్నాయి. తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు తీవ్రం కావడంతో దాదాపు 60 మంది ఆసుపత్రులకు పరుగు లు తీశారు. చిన్న పిల్లలు సైతం ఫుడ్‌ పాయిజన్‌కు గురి కావడంతో జిల్లా కలెక్టర్‌ రాజకుమారి స్పందించారు. తక్షణమే కాలనీకి వెళ్లి బాధితులకు సహాయ చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌, డీఎంహెచ్‌ఓ, ఫుడ్‌సేఫ్టీ అధికారి వెంకటరాముడు, పలు శాఖల అధికారులు కాలనీకి వెళ్లి బాధితులను పరామర్శించారు. గతంలో పలు మార్లు మిగులు అన్నాన్ని తెచ్చుకొని తిన్నామని, ఎప్పుడూ ఇలా జరగలేదని బాధితులు చెప్పారు. అధికారులు మాట్లాడుతూ.. మిగులు ఆహారం తినడం వల్లే ఫుడ్‌పాయిజన్‌ అయ్యిందని, తాగునీటి శ్యాపింల్స్‌ను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపామన్నారు. నివేదికలు వచ్చిన తర్వాత కారణాలు తెలుస్తాయన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement