మామిడిని ఆరోగ్యంగా మాగిద్దాం | - | Sakshi
Sakshi News home page

మామిడిని ఆరోగ్యంగా మాగిద్దాం

Mar 21 2026 5:22 AM | Updated on Mar 21 2026 5:22 AM

● కాల్షియం కార్బైడ్‌ వద్దు ● ఇథిలీన్‌ వాయువు ఎంతో మేలు ● ఉద్యానశాఖ జిల్లా అధికారి రాజాకృష్ణారెడ్డి సూచనలు

● కాల్షియం కార్బైడ్‌ వద్దు ● ఇథిలీన్‌ వాయువు ఎంతో మేలు ● ఉద్యానశాఖ జిల్లా అధికారి రాజాకృష్ణారెడ్డి సూచనలు

కర్నూలు(అగ్రికల్చర్‌): మామిడి.. ఫలాల్లో రారాజు. వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల కోసం ఎదురుచూడని వారుండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ ఏడాది మామిడి పంట తక్కువగా ఉంది. మొదట్లో పూతతో ఊరించిన మామిడి తర్వాత వాతావరణంలో వచ్చిన మార్పులతో 80 శాతంపైగా రాలిపోయింది. మామిడి మార్కెట్‌లోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో మామిడిని ఆరోగ్యకరమైన పద్ధతుల ద్వారా మాగించాల్సిన అవసరం ఉందని కర్నూలు ఉద్యానశాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి తెలిపారు.

ఇవీ సూచనలు..

● కార్బైడ్‌కు ప్రత్యామ్నాయంగా పండ్లు మాగించే పద్ధతుల గురించి రైతులు, వ్యాపారులు తెలుసుకోవాలి.

● ఆరోగ్యవంతమైన పద్ధతిలో మాగిస్తే అటువంటి పండ్లకు డిమాండ్‌ వస్తుంది.

● ప్రకృతి సిద్ధంగా పండ్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఇథలీన్‌తో మామిడిని మాగించాలి. ఇది రంగు, రుచి వంటి మార్పులకు ఉపయోగపడుతుంది.

● తప్పని పరిస్థితుల్లో కాయలు మాగబెట్టేందుకు ఎథిలిన్‌ వాయువు 100 పీపీఎం మాత్రమే ఉపయోగించాలి.

● అవసరమైతే 100 పీపీఎం ఎథిలిన్‌ వాయువు 24 గంటలు తగిలేటట్లుగా ఉంచితే 5 రోజులలో సహజత్వానికి దగ్గరగా ఎలాంటి హాని లేకుండా మాగుతాయి.

● మాగని కాయలను, కొన్ని మాగిన పండ్లను గాలి చొరబడని డబ్బాల్లో ఉంచాలి.

● పక్వానికి వచ్చిన కాయలను ఒక రూములో వరిగడ్డి లేదా బోదగడ్డిలో ఉంచితే సహజ సిద్ధంగా మాగుతాయి.

● కార్బైడ్‌ వాడని పండ్లు పసుపు, లేత ఆకుపచ్చ రంగులు కలిగి లోపల పండు మొత్తం పరిపక్వంగా ఉంటుంది. కొంత దూరం వరకు పండ్లు మాగినట్లుగా కమ్మని వాసన వస్తుంది.

● సహజంగా మాగిన మామిడి పండ్లు మెత్తగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.

● కృత్రిమంగా మాగిన వాటిలో పండ్ల తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటాయి. పండు త్వరగా పాడైపోతుంది. తొక్కపై నల్లని చుక్కలు ఏర్పడతాయి.

● పండ్లను ముందుగా ఉప్పు కలిపిన నీటిలో 15–20 నిముషాలు ఉంచి, తిరిగి వాటిని మంచినీటిలో కడిగి తడి లేకుండా తుడిచిన తర్వాత తినాలి. ఫ్రిజ్‌లో ఉంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పండ్ల తొక్కను తీసి తినడం మంచిది.

కార్బైడ్‌తో మాగిస్తే శిక్ష

ఆహార సురక్షణ ప్రమాణాల చట్టం–2006 ప్రకారం కార్బైడ్‌ వాడి పండ్లు మాగబెట్టిన వారికి, అమ్మేవారికి ఒక ఏడాది జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. కార్బైడ్‌ వాడిన పండ్లను తినడంతో అనేక వ్యాధులు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఈ విషయం శాసీ్త్రయంగా నిర్థారణ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement